జూలై 2021లో వరద నీరు తన ఇంటిలోకి ప్రవేశిస్తుండటంతో శుభాంగి కాంబ్లే తన వస్తువులన్నిటినీ వదిలేసి ఇల్లు వదిలి పారిపోయారు. వెళ్ళేటపుడు ఆమె త్వరత్వరగా రెండు నోట్బుక్కులను మాత్రం తనతో పట్టుకెళ్ళారు.
రాబోయే వారాలూ నెలల్లో, ఒక్కొక్కటి 172 పేజీలున్న ఈ రెండు పుస్తకాలు అనేక జీవితాలను రక్షించడంలో ఆమెకు సహాయపడతాయి
అది, మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలోని అర్జున్‌వాడ్ అనే ఆమె గ్రామం ఇప్పటికే మరొక విపత్తుతో - వేగంగా పెరుగుతోన్న కోవిడ్ -19 కేసులు - వ్యవహరిస్తోన్న సమయం. శుభాంగి నోట్‌బుక్‌ల లోపలి పేజీలలో గ్రామంలోని కరోనావైరస్ కేసులకు సంబంధించిన మొత్తం సమాచారం - ఫోన్ నంబర్లు, చిరునామా, కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలు, వారి వైద్య చరిత్ర, ఆరోగ్య రికార్డులు మొదలైనవన్నీ చక్కగా రాసివున్నాయి.
"(గ్రామంలో నిర్వహించిన RT-PCR పరీక్షల) కోవిడ్ నివేదికలు మొదట నాకే వస్తాయి,” అని ఈ 33 ఏళ్ల అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ASHA-ఆశా) చెప్పారు. 2005లో భారతదేశ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద నియమించబడిన లక్షమంది మహిళా సామాజిక ఆరోగ్య పరిరక్షణ కార్యకర్తలలో శుభాంగి ఒకరు. శిరోల్ తాలూకాలోని వరద సహాయక శిబిరానికి తరలించబడిన కోవిడ్-పాజిటివ్ గ్రామస్థుడిని గుర్తించడంలో ఆమె నోట్స్ ఆమెకు సహాయపడింది. అతని ద్వారా కనీసం 5,000 మంది ఇతర వ్యక్తులకు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది..
"వరదల కారణంగా, చాలామంది వ్యక్తుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అవటమో లేదా, నెట్వర్క్ కవరేజీలో లేకపోవడమో జరిగింది," అన్నారామె. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెర్వాడ్లోని తన తల్లిగారి ఇంటికి మారిన శుభాంగి, వెంటనే తాను చేతితో రాసిన రికార్డులను వెతికి, శిబిరంలో ఉన్న మరికొందరి ఫోన్ నంబర్లను కనుగొన్నారు. "ఎలాగైతేనేం, నేను రోగిని సంప్రదించగలిగాను."






















