మామిడికి పూత రావడానికి 25-30 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత సరైనదని ఉద్యానవన శాస్త్రవేత్త శంకరన్ చెప్పారు. "ఫిబ్రవరి 2023లో రాత్రీ పగళ్ళ ఉష్ణొగ్రతలతో చెప్పుకోతగ్గ వ్యత్యాసాలున్నాయి. ఇటువంటి తేడాలను చెట్లు భరించలేవు." అన్నారాయన.
గత కొన్నేళ్ళుగా మామిడి సాగుకు అనువైన పరిస్థితులు దిగజారిపోతుండటంతో శ్రీరామమూర్తి ఈ పంటను సాగుచేయాలని తాను 2014లో తీసుకున్న నిర్ణయం గురించి ఇప్పుడు చింతిస్తున్నారు. ఆ ఏడాది ఆయన అనకాపల్లి పట్టణానికి సమీపంలో తనకు ఉన్న 0.9 ఎకరాల భూమిని అమ్మేసి, ఆ వచ్చిన ఆరు లక్షల రూపాయలను పోముల భీమవరంలోని మామిడితోటకు పెట్టుబడిగా పెట్టారు.
అప్పుడలా చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఆయన "అందరూ ఆ పండ్లను (మామిడి) చాలా ఇష్టపడతారు. వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. అంచేత మామిడి సాగు నాకు మంచి లాభాలను తెచ్చిపెడుతుందని ఆశపడ్డాను," అన్నారాయన.
ఏదైతేనేం, అప్పటినుంచీ తనేమీ లాభాలను పొందలేకపోయినట్టు ఆయన చెప్పారు. "2014 నుండి 2022 మధ్య, మామిడి సాగు ద్వారా నా మొత్తం ఆదాయం (ఈ ఎనిమిదేళ్లలో) ఆరు లక్షల రూపాయలకు మించలేదు," అని శ్రీరామమూర్తి చెప్పారు. భూమిని విక్రయించాలనే అప్పటి తన నిర్ణయానికి పశ్చాత్తాపపడుతూ, “నేను అమ్మిన భూమికి ఇప్పుడు ఎన్నోరెట్లు విలువ పెరిగింది. బహుశా నేను మామిడి సాగును మొదలుపెట్టకుండా ఉండాల్సింది." అన్నారు.
కేవలం వాతావరణ పరిస్థితులవల్లనే కాదు, మామిడి పంటకు సాగునీరు అవసరం. నాగరాజుకు గానీ, శ్రీరామమూర్తికి గానీ వారి భూముల్లో బోరుబావులు లేవు. 2018లో శ్రీరామమూర్తి రూ.2.5 లక్షలు వెచ్చించి బోరుబావి తవ్వినా అందులో చుక్క నీరు పడలేదు. నాగరాజు, శ్రీరామమూర్తిల తోటలు ఉన్న బుచ్చయ్యపేట మండలంలో అధికారికంగా 35 బోర్‌బావులు, 30 నేలబావులు ఉన్నాయి.
చెట్లకు నిరంతరం నీటి సరఫరా ఉండేలా చూస్తే ఈ పూత ఎండిపోయే సమస్యను పరిష్కరించవచ్చని శ్రీరామమూర్తి చెప్పారు. ఆయన వారానికి రెండు ట్యాంకర్ల నీటిని కొంటారు. దాని కోసం నెలకు రూ. 10,000 ఖర్చుచేస్తారు. “ప్రతి చెట్టుకు ప్రతిరోజూ కనీసం ఒక లీటరు నీరు అవసరం. కానీ నేను వారానికి రెండుసార్లు మాత్రమే వాటికి నీరిస్తున్నాను; నేను అంతవరకే భరించగలను,” అంటారు శ్రీరామమూర్తి.
తన మామిడి చెట్లకు నీటికోసం నాగరాజు కూడా ఒక్కో ట్యాంకరుకు రూ. 8000 చొప్పున చెల్లిస్తూ ప్రతివారం రెండు ట్యాంకర్ల నీరు కొంటున్నారు.