“జడలబర్రెల జనాభా క్రమేణా తగ్గిపోతూవుంది," గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జడలబర్రెలను మేపుతోన్న పద్మ థుమో అన్నారు. "ఈమధ్య దిగువ పీఠభూమి ప్రాంతంలో (దాదాపు 3000 మీటర్లు) జడలబర్రెలు చాల తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి,” అన్నారామె.
జాంస్కర్ బ్లాక్ లోని అబ్రాన్ గ్రామానికి చెందిన పద్మ, ఏడాదికి సుమారు 120 పశువులతో కలిసి, లదాఖ్‌లోని ఎత్తైన, శీతలమైన పర్వత శ్రేణుల్లో వాటిని మేపుతూ తిరుగుతుంటారు. ఇక్కడి ఉష్ణోగ్రతలు దాదాపుగా -15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంటాయి.
జడలబర్రెలు (బోస్ గ్రునియెన్స్) ఇక్కడి శీతల ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి కానీ ఉష్ణోగ్రత 13 డిగ్రీల కంటే ఎక్కువ పెరిగితే తట్టుకుని జీవించలేవు.
గత కొన్ని దశాబ్దాలుగా జాంస్కర్ లోయ దిగువ పీఠభూమిలో సగటు వేసవి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు దాటుతున్నాయనీ, చివరకు 32 డిగ్రీల సెల్సియస్‌కు కూడా పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. “శీతాకాలం ఉష్ణోగ్రతలకూ, వేసవికాలం ఉష్ణోగ్రతలకూ మధ్య చాలా అంతరం ఉంటోంది,” అని స్థానికంగా లోయలో నివసిస్తూ డ్రైవర్‌గా పనిచేసే తెన్జిన్ ఎన్. అన్నారు.
ఈ అసాధారణ ఉష్ణోగ్రతలు, 2012 నుండి 2019 మధ్యకాలంలో జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని జడలబర్రెలపై ప్రభావం చూపించడంతో వాటి సంఖ్య సగానికి (20వ పశు గణన ఆధారంగా) తగ్గిపోయింది.























