యక్షగానపు నృత్యరీతిని ఆమె అనుకరించడాన్ని చూసిన మూకాంబిక తాతగారికి, “చాలా కలవరం కలిగింది, నన్ను చీవాట్లు పెట్టారు.” కోస్తా కర్ణాటకకూ, కేరళలోని కాసరగోడ్కూ చెందిన ఈ జానపద నృత్యరీతిని ప్రదర్శించేందుకు మహిళలకు అనుమతి లేదని, కౌమార బాలికగా ఉన్న ఆమెను ఆయన హెచ్చరించారు.
ఇప్పుడు 75 సంవత్సరాల వయసున్న మూకాంబిక వారంబళ్ళికి, చిన్నపిల్లగా ఉండగా తన స్వగ్రామమైన ఉడుపి జిల్లాలోని మార్వి గ్రామంలో జరిగే యక్షగాన ప్రదర్శనలపట్ల ఎంతో ఆసక్తి ఉండేది. తరచూ సందెచీకటితో మొదలై, మర్నాడు తెల్లవారుఝాము వరకూ సాగే ఈ ప్రదర్శనలను చూడడానికి మహిళలు, కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారితో పెద్దపెద్ద బృందాలుగా కలిసి మైళ్ళకొద్దీ నడిచి వెళ్ళడాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ మర్నాడు ఆమె తన ఇంటి ముంగిట్లోకి కొందరు స్నేహితులను పోగుచేసి, ప్రసంగ (రూపకం) కోసం ఆహార్యంగా దుప్పట్లను, తువాళ్ళను ధరించి, ఆ నృత్య కదలికలను అనుకరించేది.
“తాతగారు లేనప్పుడే మేం మా ఇంటి ముంగిట్లో ఆ ప్రదర్శన చేసేవాళ్ళం,” చెప్పారామె. “యక్షగాన ఆడపిల్లలు చేయతగింది కాదని ఆయన నమ్మకం.”
శతాబ్దాలుగా కర్ణాటక తీరప్రాంతంలోనూ, కేరళ జిల్లాలోని కాసరగోడ్ అంతటా ప్రదర్శించే యక్షగాన అంటే ‘దేవతల పాటలు’ అని అర్థం. సంగీతం, నాట్యం, సంభాషణలు, కథనాలను కూర్చి రూపొందించే ఈ ప్రదర్శనలు రామాయణం, మహాభారతం వంటి పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి కథలను తీసుకుంటాయి. ఈ యక్షగాన మేళాలు తరచుగా ఆ ప్రాంతంలోని ప్రముఖ దేవాలయాల ప్రాపకంలో జరిగేవి.
అధిక శారీరక శ్రమతో కూడిన ఈ కళారూపాన్ని, స్థానికంగా గండు కళె - పురుష కళారూపం - అని పిలుస్తారు. ఈ నృత్యంలో ఛెంగున ఎగరవలసిన, మెలికలు తిరగవలసిన సందర్భాలెన్నో ఉంటాయి. వాటికి తగ్గ చురుకుదనం, శారీరక దృఢత్వం సాధారణంగా పురుషులకే ఉంటాయన్న భావన ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు స్త్రీపాత్రలను కూడా పురుషులే పోషించేవారు.
“ఈ రూపకాలూ కథలూ ప్రేక్షకులకు తెలిసినవే,” అన్నారు అనుభవజ్ఞులైన యక్షగాన ప్రదర్శకులు, యక్షగాన అకాడెమీకి మాజీ అధ్యక్షులైన ఎమ్.ఎల్. సామగ. “అయితే ప్రతి ప్రదర్శననూ వారొక కొత్త వెలుగులో దర్శిస్తూ, ప్రతిసారీ ఒక అనుభవాన్ని తిరిగి కొత్తగా జీవిస్తుంటారు. ఒక పాత్రను ఒక కళాకారుడు ఎలా భిన్నంగా అర్థం చేసుకుంటాడనేది వారిని ఆకర్షిస్తుంది."














