నిగానా నుండి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కహ్నౌర్లో, ధరల పెరుగుదల ఈ ఎన్నికలలో అత్యంత ముఖ్యమైన అంశంగా కేశూ ప్రజాపతి భావిస్తున్నారు. కేశూ (44) ఇళ్ళలో, భవనాలలో నేలపై పలకలను అమర్చే పని చేస్తారు. అతను ఉప్పు, పంచదార వంటి ప్రధాన వస్తువుల ధరలను బట్టి ద్రవ్యోల్బణాన్ని లెక్కవేస్తారు. రోహ్తక్లోని కార్మిక సంఘమైన భవన్ నిర్మాణ్ కారిగర్ మజ్దూర్ యూనియన్ సభ్యుడు, దినసరి కూలీ అయిన కేశూ మాట్లాడుతూ, దశాబ్దం క్రితం లీటలు పాల ధర రూ. 30-రూ. 35 ఉండేదని, ఇప్పుడది రూ. 70 అయినదని; అప్పుడు రూ. 16 ఉన్న కిలో ఉప్పు, ఇప్పుడు రూ. 27 అయిందని అన్నారు.
“రేషన్ మన హక్కు. ఇప్పుడది ప్రభుత్వం వేసే భిక్ష లాగా అనిపిస్తోంది, దాని కోసం మనం వంగి వంగి నమస్కారాలు చేయాలి." ప్రస్తుతం, పసుపు కార్డు ఉన్నవారికి ఐదు కిలోల గోధుమలు, ఒక కిలో చక్కెర, వంట నూనె లభిస్తుండగా, గులాబీ రంగు కార్డు ఉన్నవారికి నెలకు 35 కిలోల గోధుమలు లభిస్తున్నాయి. "గతంలో ప్రభుత్వం రేషన్ మీద కిరోసిన్ ఇచ్చేది. ఇప్పుడది నిలిపివేశారు. ఎల్పిజి [లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్] సిలిండర్లను రీఫిల్ చేయించుకోవడం కష్టం. మాకు చనా [పచ్చి సెనగపప్పు], ఉప్పు కూడా వచ్చేవి,” అన్నారతను. అయితే, ఇప్పుడు వాటి సరఫరా లేదు.
వస్తువుల జాబితాలో ఇక ఉప్పు లేకపోవడంతో, "ఇప్పుడు కనీసం మేం 'హమ్నే సర్కార్ కా నమక్ నహీ ఖాయా' [మేం ప్రభుత్వం ఉప్పును తినలేదు కాబట్టి ఇప్పటి పాలనలో ఉన్న ప్రభుత్వానికి విశ్వాసంగా ఉండాల్సిన అవసరం లేదు] అని చెప్పగలం," అన్నారాయన.
హరియాణాలోని 'డబుల్ ఇంజన్' ప్రభుత్వమే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉంది. అయితే కహ్నౌర్ ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా ఉన్న రామ్రతి వంటివారికి ఆ ప్రభుత్వం పెద్దగా ఏం చేయలేదు. రామ్రతి (48) ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేస్తారు. "అంత వేడిలో, మంటల ముందు ఒక నిమిషం కూడా భరించలేనంతటి వేడిలో, నేను నెలకు 6,000 రోటీలు చేస్తాను." ఈ పనికి ఆమెకు నెలకు రూ. 7,000 వేతనంగా ఇస్తారు. తాను పడే శ్రమలో సగానికి చెల్లింపులేమీ ఉండవని ఆమె భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం వలన ఆరుగురున్న ఆమె కుటుంబాన్ని నిర్వహించడం చాలా కష్టం అవుతోంది. ఇంకా ఆమె తాను ఇంటిలో చేసే పనిని లెక్క కట్టడం లేదు. "నేను సూర్యుని పగటి వేళల కంటే ఎక్కువ సమయమే పని చేస్తాను," అని ఆమె చెప్పారు.