కిక్కిరిసివున్న ఆనంద్ విహార రైల్వే స్టేషన్లో సోనూ కుమార్ రావత్ కుటుంబానికి నిమ్మళంగా ఉన్న ఒక చోటు దొరికింది. వారి చుట్టూ నిత్య ప్రయాణీకులు, హాకర్లు, రైళ్ళు రాకపోకలు సాగిస్తున్నారు. 27 ఏళ్ళ సోనూ తమ వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అతని భార్య సితార ఖాతూన్ వారి పసిబిడ్డను పట్టుకొని ఉన్నారు. కానీ అప్పుడు సమయం మధ్యాహ్నం రెండు గంటలే అయింది. వారిని బిహార్‌లోని తమ ఇంటికి తీసుకువెళ్ళే లిచ్ఛవీ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కడానికి వారు వేడితో మండిపోతూ కిక్కిరిసి ఉన్న ఆ ప్లాట్‌ఫామ్‌పై మరో నాలుగు గంటలు వేచి చూడాల్సిందే.
సోనూ ఒక తాపీ మేస్త్రీ; సితార నిర్మాణ ప్రదేశాలలో పనులు చేస్తుంటారు. ఇద్దరూ ప్రతి రోజూ పొద్దున్నే గాజియాబాద్‌లోని కూలీల మండీల దగ్గర పని కోసం వరుసలో నిలబడతారు. ఈ మధ్య కొన్ని వారాలుగా, "రోజంతా ఆ లేబర్ చౌక్ దగ్గరే గడిపినా, రెండు మూడు రోజుల పాటు మాకసలు ఏ పనీ దొరకలేదు," అన్నారు సోనూ.
అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై జరుపుతోన్న యుద్ధం, పర్యవసానంగా హార్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా దేశవ్యాప్తంగా ఎల్పిజి ధరలు పెరిగిపోవటంతో దిల్లీలో జీవనం సాగించటం రావత్ కుటుంబానికి ఆర్థికంగా అసాధ్యంగా మారింది.
"ఇంతకుముందు మేం గ్యాస్ సిలిండర్ మీద, రూ. 1200, అద్దె రూ. 2500, విద్యుత్ కోసం రూ. 500 ఖర్చుపెట్టేవాళ్ళం. మేమింకా తినకముందే, నెల ఖర్చుల్లో అప్పుడే 4,000 నుండి 5,000 రూపాయలు అయిపోతుంది," అన్నారు సోనూ. ఈ ప్రాథమిక అవసరాల కోసం కూడా ఖర్చుపెట్టలేకపోవటంతో, వారికి తమ గ్రామాలలోని ఇళ్ళకు తిరిగి వెళ్ళటం తప్ప మరో దారి లేకుండాపోయింది.
అయితే, వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళటమనేది చాలా ఇబ్బందులతో కూడుకున్నది - చెరొక మతానికి చెందిన వీరిద్దరూ ఇళ్ళ నుంచి పారిపోయి పెళ్ళి చేసుకున్నారు. ఎవరికీ తెలియకుండా బతకటానికి, పని కోసం వారు రాజధానీ నగరానికి వచ్చి ఒక ఏడాది లోపే అవుతోంది. ఇప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళాల్సివచ్చింది. కొంత సానుకూలమైన ఆదరణ లభిస్తుందనే ఆశతో, వారు సీవాన్ జిల్లాలోని మైర్వాలో ఉన్న సితార ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
దిల్లీలో ఈ కుటుంబం కనావానీ గ్రామ శివారులో ఉన్న ఒక మురికివాడలో ఒక ఒంటి గది ఇంటిలో నివాసముంటోంది. "మాకు నెలలో ఒక 20 రోజులు పని దొరుకుతుంది," చెప్పారు సోనూ. "మంచిగా పని దొరికిన నెలలో మేం ఒక్కొక్కరం 10,000 [రూపాయలు] సంపాదించాం," ఎంతో జాగ్రత్తగా తాను నడుపుకొస్తోన్న ఇంటి ఆర్థిక వ్యవస్థను ఈ ఎల్పిజి సంక్షోభం ఎలా చిందరవందర చేసిందో వివరిస్తూ ఆయన నిట్టూర్పు విడిచారు.






