"పరీక్షకు సిద్ధం కావటం మా బాధ్యత. ప్రశ్నపత్రాల భద్రతను చూసుకోవడం అధికారుల పని," అని అంశు కుమారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సుమారు 24 ఏళ్ళ వయసున్న అంశు కుమారికి పోటీ పరీక్షలతో ముడిపడి ఉండే ఒత్తిడి గురించి బాగా తెలుసు. ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూన్న ఆమె ఒక ఓపెన్ యూనివర్సిటీ నుండి బి.ఎడ్. (B.Ed.) కోర్సును చేస్తూనే, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలనే లక్ష్యంతో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) కోసం కూడా సన్నద్ధమవుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశతో అంశు 2023, 2024లలో బ్యాంక్ నియామక పరీక్షలకు హాజరయ్యారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఆమె బోధనా వృత్తి వైపుకు మళ్ళి, రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ నియామక పరీక్షల కోసం రాత్రివేళల్లో చదవుకోవడం ప్రారంభించారు.













