ఝూనూ సంతోషంగా తాటాకులు తింటోంది. ఈ పెంపుడు మేక ఆహారంలో ఇవి భాగం కాదు, కానీ అప్పుడప్పుడూ ఇవొక రుచికరమైన విందుగా ఉంటాయి.
ఆ చిన్న పెంపుడు జంతువు వాటిని మామూలుగా తింటుంటే, ఆ తాటిమట్టకున్న పొడవాటి ఆకులతో టోపీ తయారుచేస్తోన్న కల్యాణి పాత్రా కొద్దిగా వ్యాకులపడుతున్నారు. అనుభవజ్ఞురాలైన ఆ కళాకారిణి, తన మేక ఝూనూ తలపై మెల్లగా తడుతూ, అసలే కొరతగా ఉన్న ఆ ముడిపదార్థాన్ని అది తినకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
అందుకొక కారణం ఉంది: ఆ తాటి చెట్టు (బోరసూస్ ఫ్లేబెల్లైఫర్) చాలా పొడవుగా, దాదాపు 30 మీటర్ల ఎత్తు ఉంటుంది. “మాకుండే ప్రధాన అడ్డంకి తాటాకు తెచ్చుకోవడం. ఇది బెంగాల్లో పెరిగే ఎత్తైన చెట్లలో ఒకటి. ఇక్కడ చాలా చెట్లున్నాయి, కానీ వాటిని ఎక్కే నేర్పు అందరికీ ఉండదు,” 50 ఏళ్ళ కల్యాణి చెప్పారు.
టోపీలు అల్లడంలో మరో అనుభవజ్ఞురాలైన పొరుగింటి ఛాయా ప్రమాణిక్, కల్యాణితో ఏకీభవించారు. “ఇంతకుముందు, ఇంట్లో ఉండే మగవాళ్ళు ఆకులు తెచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ కుర్రాళ్ళకు తాటి చెట్టు ఎక్కడమెలాగో తెలియదు.” ఆ పైన, తాత్వికతనూ అనుభవాన్నీ జోడిస్తూ, “అయినా, చెట్లు ఎక్కేంత తీరిక ఇప్పుడు ఎవరికి ఉంది?" అన్నారు ప్రమాణిక్.
కల్యాణి, ఛాయ తరతరాలుగా తాటాకులతో పనిచేస్తోన్న ఆఖుడీ డోమ్ సముదాయానికి చెందినవారు. “మా చుట్టుపక్కల ప్రాంతమంతా తాటాకు, వెదురు పనులకు ప్రసిద్ధిగాంచింది,” తన చేతులను కదిలిస్తూనే చెప్పారు కల్యాణి. “గతంలో, మా సముదాయంలో వివాహం జరిగేటప్పుడు స్త్రీ, పురుషులిద్దరికీ వెదురు పనిలో నైపుణ్యం ఉండడమనేది ఒక సహజ ధర్మంగా పరిగణించేవారు.” కానీ ఇప్పుడు ఈ చేతిపనులను డోమ్ సముదాయపు (రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేయబడింది) మహిళలే ఎక్కువగా చేస్తున్నారని ఆమె వివరించారు. వాళ్ళు తాటాకులతో, వెదురుతో టోపీలు, విసనకర్రలు, ఇతర వస్తువులు తయారుచేస్తారు.


























