ఖుమనియా ఆదివాసీ కఫార్ గ్రామ సర్పంచ్. అయితే అది కాగితాల మీద మాత్రమే వాస్తవం.
కానీ, "కోయీ నామ్-మాత్ర్ కా భీ సర్పంచ్ నహీఁ సమఝ్తా ఇస్ గాఁవ్ మేఁ [ఈ గ్రామంలో నన్ను పేరుకు కూడా సర్పంచ్‌గా ఎవరూ గుర్తించరు]," అంటారామె
ఖుమనియా 2022, జూన్ 14న ఎటువంటి పోటీ లేకుండా ఈ పదవికి ఎన్నికయ్యారు. 58 ఏళ్ళ ఈ సహరియా ఆదివాసీ మహిళ మధ్యప్రదేశ్‌లోని తన గ్రామమైన కఫార్ స్థానిక పాలనా పదవి కోసం పంచాయతీ కార్యాలయానికి తనను ఎలా పిలిపించారో గుర్తుచేసుకున్నారు. ఆమె అక్కడికి వెళ్ళడం అదే మొదటిసారి, ఆ ఒక్కసారే కూడా.
"మొదట్లో నన్ను ఆ ఒక్కసారి మాత్రమే పిలిచారు," అని ఖుమనియా చెప్పారు. ఆమె వచ్చాక ఆమెకు ఒక సర్టిఫికేట్‌ను అందజేశారు. ఆమె గ్రామ సర్పంచ్‌గా పోటీ లేకుండా ఎన్నికయ్యారని ఆ పత్రంలో ఉంది. ఆమె ఎప్పుడూ బడికి వెళ్ళలేదు కాబట్టి ఆమెకు చదవడం, రాయడం రాదు. దాంతో ఆ పత్రాన్ని ఎవరో ఆమెకు చదివి వినిపించాల్సి వచ్చింది.
“హమాయ్ పంచాయిత్ మేఁ ఆదివాసీ సీట్ ఆయీ హతీ, తో గాఁవ్ కే బడే లోగన్ నే హమావ్ నామ్ దే దవ్ [మా పంచాయతీ స్థానాన్ని ఆదివాసీ కి కేటాయించినప్పుడు, గ్రామంలోని పెద్దమనుషులు దానికి నన్ను నామినేట్ చేశారు]. నాకు వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేదు,” అంటూ ఖుమనియా స్థానిక బుందేల్‌ఖండీ భాషలో చెప్పారు.







