“నేను 12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలు రాశాను. ఆర్ట్స్ విభాగం ఫలితాలు జూన్‌లో రానున్నాయి. ఆ తరువాత ఏం చేయాలో నాకు సరిగ్గా తెలియదు, కానీ సీనియర్ కాలేజీకి వెళ్ళి డిగ్రీ పూర్తి చేయాలనుకుంటున్నాను,” సంకేత్ లోఖండే తన ఆకాంక్షను వెల్లడించాడు. అది 2021 నాటి మాట. అప్పుడతను కూడా 18 ఏళ్ళ వయసున్న ఇతర కుర్రాళ్ళకు లాగే ఎంతో చలాకీగా ఉండేవాడు. కానీ ఇప్పుడతను నాతో మాట్లాడుతూ నిట్టూరుస్తున్నాడు. ఆ నిట్టూర్పు సైతం అతన్ని అలసిపోయేలా చేస్తోంది. ఇంటి ముంగిట్లో, తన మోచేతులను మోకాళ్ళపై ఆనించి ఒక అల్లిక మంచం మీద కూర్చున్న అతని శరీరమంతా అలసటతో నిండిపోయి ఉంది. ఈ వారం అతను చేయించుకోవలసిన డయాలసిస్ సెషన్ నాలుగు రోజుల క్రితం జరిగింది.
“బోర్డు పరీక్షలు ముగిసిన కొన్ని వారాల తరువాత నాకు ఆయాసం మొదలైంది. కొన్ని అడుగులు నడిచినా కూడా నాకు నిస్త్రాణగా ఉండేది,” చెప్పాడతను. అతని తల్లిదండ్రులు, తమ కొడుక్కి అత్యుత్తమ చికిత్స అందించాలనే ఉద్దేశంతో, తమ నిమ్గావ్ భోగీ గ్రామానికి సుమారు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహిల్యానగర్ (గతంలో అహ్మద్‌నగర్)లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అయితే, పరీక్షల ఫలితాలు విడుదలయ్యే సమయానికి, మూత్రపిండాల పూర్తి వైఫల్యం కారణంగా అతను ఇంటికే పరిమితమైపోవాల్సి వచ్చింది.
“మేం తాగే నీరే దీనికి కారణమై ఉండవచ్చని వైద్యులు చెప్పారు. మేమందరం చెరువులో నీటినే తాగేవాళ్ళం; అది కలుషితమైపోయినట్లుంది. మా కొడుకు అనారోగ్యం పాలయ్యేంత వరకూ మాకు ఆ విషయం తెలియను కూడా తెలియలేదు,” సంకేత్ తల్లి, 47 ఏళ్ళ మనీషా అన్నారు.
ఆమె పాఝర్ తలావ్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఇది ఒక ఇంకుడు చెరువు; సుమారు యాభై ఏళ్ళ క్రితం వాన నీటి సేకరణ, నిల్వ కోసం ఒక సహజ నీటి ప్రవాహ మార్గం మీదుగా కృత్రిమంగా మట్టితో కట్టిన నిర్మాణం ఇది. ఆ గ్రామంలోని 330 కుటుంబాలు తమ ఇంటి అవసరాలకూ, వ్యవసాయ పనులకూ ఈ చెరువు మీదే ఆధారపడ్డాయి. అయితే, గత 12-15 ఏళ్ళుగా గ్రామంలో క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యం కేసులు పెరుగుతూ వస్తున్నాయి.
“కలుషిత నీటిని ఎక్కువ కాలం తాగితే మూత్రపిండాలు దెబ్బతింటాయని వైద్యులు మమ్మల్ని హెచ్చరించారు. మా గ్రామంలో చాలామంది మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు,” మనీషా తెలిపారు. రిపోర్టింగ్ కోసం ఆ ఊరికి నేను వెళ్ళిన మొదటిసారే, ప్రతీ కుటుంబంలో కనీసం ఒక వ్యక్తి డయాలసిస్ చేయించుకుంటున్న ఐదు కుటుంబాలను కలిశాను.






















