"ఇప్పుడు మాకు వాళ్ళ పొలాల్లోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మా గింజలను మేమే పండించుకుంటాం; మా దాణాను మేమే పెంచుకుంటాం. మీ కళ్ళకు కనిపిస్తున్నదంతా మా భూమే." రాజిందర్ కౌర్ తన చేతిని చాచి, సుమారు 125 ఎకరాల మేర విస్తరించివున్న ప్రాంతాన్ని చూపించారు. స్వాతంత్య్రం వచ్చిన 67 సంవత్సరాల తరువాత, ఈ గ్రామానికి చెందిన దళితులు 2014లో ఇక్కడి ఆధిపత్య కులాల నుండి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
బలాద్ కలాఁ గ్రామంలోని ఆధిపత్య కులాలకు చెందిన పురుషులు, దళితులు తమ పొలాల్లోకి అడుగుపెట్టినప్పుడు, వారికి 'వారి స్థానాన్ని చూపించిన' కథ, దాదాపు ప్రతి భూమిలేని దళిత మహిళకూ ఉంటుంది. వారు ఎదుర్కొన్న అవమానాలు ఇప్పటికీ జ్ఞాపకాలలో ఉన్నప్పటికీ, చారిత్రాత్మకమైన వారి పోరాటం వాటిని గతంలోకి నెట్టివేసినట్లుగా అనిపిస్తోంది.
పంచాయతీ భూములలో మూడింట ఒక వంతు వాటాపై తమ హక్కును తిరిగి పొందేందుకు దళిత ఉద్యమం తీవ్రంగా పోరాడింది. అది పంజాబ్ గ్రామ ఉమ్మడి భూముల (రెగ్యులేషన్) చట్టం, 1961లో పొందుపరచిన హక్కు. వారి పోరాటాల వలన 2014 నుండి దక్షిణ పంజాబ్లోని 162 గ్రామాల్లో 20,000 బిఘాలను (సుమారు 4,210 ఎకరాలు) తిరిగి పొందగలిగారు. ఇప్పుడు, దళితులు మరోసారి ప్రతిఘటనకు ఉన్న అడ్డంకులను వెనక్కు నెడుతున్నారు. 1972 భూ పరిమితి చట్టంలో నిర్దేశించిన పరిమితులకు మించి ఆధిపత్య కులాల ఆధీనంలో ఉన్న భూములపై వారు తమ హక్కును అడుగుతున్నారు.
7వ నంబరు జాతీయ రహదారిలోని సంగ్రూర్, పటియాలాల మధ్య ఉన్న బలాద్ కలాఁ, ఈ ఉద్యమపు అత్యంత నిర్ణయాత్మక క్షణాన్ని ఎదుర్కొంది. రాజిందర్ కౌర్ వంటి మహిళలు తమ సమష్టి పోరాటం సాధించిన అద్భుతాల గురించి నేడు బహిరంగంగానూ సుదీర్ఘంగానూ సంతోషంతో మాట్లాడగలిగిన ప్రదేశం ఇదే. బలాద్ కలాఁకు న్యాయం కోసం పోరాటాలు చేయడం కొత్త కాదు. న్యాయమైన ప్రపంచం అనే కలను నిజం చేసుకునేందుకు పోరాడుతూ మరణించినవారి కోసం గ్రామ పరిధిలో నిర్మించిన స్మారక చిహ్నాలు దాని ప్రతిఘటన చరిత్రకు నిశ్శబ్ద సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి.













