డ్రైవరు ఆమెను ఇంటి దగ్గర దింపుతానని హామీ ఇచ్చాడు, కాని కారు ఆమె వెళ్లాల్సిన దిశకు వ్యతిరేకంగా వెళుతూనే ఉంది. అతను హైవే మీద మొదట వచ్చిన యు-టర్న్ తీసుకోనప్పుడు, అతను మరచిపోయాడేమో అని నేహ భావించింది. రెండో యు-టర్న్ వచ్చి వెళ్ళాక 15 ఏళ్ల ఆ బాలికకు అనుమానం కలిగింది. మూడోసారీ అలా జరగడంతో ఆమె భయాందోళనలకు గురైంది. ఆమెకు ఏడుపు వచ్చేసింది; నోరంతా చేదుగా తయారైంది.
అనుమానం, అపనమ్మకంతో ఆమె తనను తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకుపొమ్మని గట్టిగా కేకలు వేసింది. కారులో ఆమె పక్కన కూర్చునివున్న మహిళ, డ్రైవర్ ఇద్దరూ ఆందోళన చెందాల్సిన పని లేదంటూ ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.
కానీ మనసు లోలోతుల్లో నేహకు తానో పెద్ద సమస్యలో ఇరుక్కున్నానని తెలిసిపోయింది. ఇంటిని వదిలివెళ్ళాలనుకోవటం ఆమె దుడుకుగా తీసుకున్న నిర్ణయం, అందుకు ఆమె అప్పటికే పశ్చాత్తాపపడుతోంది.
ఆ సంవత్సరం ప్రారంభంలో, మే 2023లో, ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడుపుతూ పుస్తకాలు చదవడం లేదని తల్లిదండ్రులు కోప్పడడంతో ఆ టీనేజీ అమ్మాయి వాళ్లతో వాగ్వాదానికి దిగింది. వాళ్లు నేహ ఫోన్‌ను తీసేసుకోవడంతో అప్పటికి ఆ గొడవ ముగిసింది.
"మా అమ్మానాన్నలు నా మొబైల్ ఫోన్‌ను తీసుకోవడంతో నాకు చాలా కోపం వచ్చింది," ఆమె లోగొంతుకతో, కళ్లలోకి చూడకుండా చెప్పింది. "అందుకే నేను వాళ్లకు దూరంగా వెళ్లిపోవాలనుకున్నాను."
అందుకని ఆమె ఉదయం 6 గంటలప్పుడు ఇంటి నుంచి బయలుదేరి, తన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇరుకైన వీధులన్నీ దాటుకొని హైవేకి వెళ్లే దారిపట్టింది. ఇంకా తల్లిదండ్రులపై కోపంతో ఉన్న ఆమె, తాను చాలా దూరం వచ్చేసిందని గ్రహించేలోపే హైవే వెంట 7-8 కిలోమీటర్లు నడిచింది. అప్పటికి సూర్యోదయమై కొన్ని గంటలు కావడంతో ఆమెకు దాహం వేసింది, కానీ నీళ్ళ బాటిల్ కొనడానికి ఆ అమ్మాయి దగ్గర డబ్బు లేదు.
ఇంతలో మెరుస్తున్న నల్లటి సెడాన్ ఆమె ముందు ఆగింది. "ఒక మగ మనిషి ఆ కారును నడుపుతున్నాడు, వెనుక ఒక మహిళ కూర్చునివుంది" అని నేహ గుర్తు చేసుకుంది. ఆ మహిళ కిటికీ అద్దాలు దించి, ఇంటి దగ్గర దింపాలా అని నేహను అడిగింది. "వాళ్లిద్దరూ మంచి మనుషుల్లాగే కనిపించారు. వెనక్కి తిరిగి నడిచి వెళ్లడానికి నేను చాలా అలసిపోయాను, బస్ టికెట్‌కు నా దగ్గర డబ్బు కూడా లేదు.’’
సహాయం చేస్తామన్న వాళ్ల ప్రతిపాదనకు నేహ అంగీకరించింది. ఎయిర్ కండీషనర్‌తో ఆమెలో అలసట తొలగిపోగా, తలను వెనుకకు వాల్చి చేతిరుమాలుతో నుదుటి మీది చెమటను తుడుచుకుంది. ఆ మహిళ నేహకు నీళ్ల బాటిల్ అందించింది.
కానీ ఆ వ్యక్తి కారును ఆమె ఇంటికి దూరంగా తీసుకుపోవడం గమనించినప్పుడు అప్పటివరకూ ఆమె పొందిన హాయి కాస్తా భయంగా మారింది. ఆమె అరుస్తూ ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు ఒక గంట తర్వాత కానీ కారు ఆగలేదు. వాళ్లు భోపాల్ చేరుకున్నారు. నేహను వాళ్లు కిడ్నాప్ చేశారు.
భారతదేశంలో, 2016 నుండి 2021 మధ్య కాలంలో మొత్తం 4,03,825 మంది పిల్లలు కనిపించకుండాపోయారు. ఆందోళన కలిగించే ఈ గణాంకాలలో, మధ్యప్రదేశ్ చాలా కాలంగా అగ్రస్థానంలో ఉంటూవస్తోంది – ఈ మధ్య కాలంలో, రాష్ట్రంలో అధికారికంగా 60,031 కేసులు నమోదయ్యాయి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో). చైల్డ్ రైట్స్ అండ్ యు (CRY) వారు 2022లో సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం 11,717 మంది పిల్లలు తప్పిపోయారు. అంటే సంవత్సరానికి సగటున 10,250 మంది లేదా రోజుకు 28 మంది పిల్లలు - భారతదేశంలోని ఏ ఇతర రాష్ట్రం కంటే కూడా ఇది ఎక్కువ.




