ఆమె పేరేమిటని మేం అడిగినప్పుడు, "వేండా", అని తమిళంలో జవాబిచ్చారామె. అది నిజంగానే ఆమె పేరనీ, దానిపట్ల ఎలాంటి వ్యతిరేకతా లేకుండానే ఆమె జవాబిచ్చారనీ అర్థం కావటానికి మాకు గందరగోళం నిండిన కాస్త సమయం పట్టింది. తమిళంలో వేండామ్ అనే పదానికి సంక్షిప్త రూపమైన ‘వేండా’ అనే పదానికి ‘వద్దు/అవసరం లేదు’ అని అర్థం.
39 ఏళ్ళ ఎన్. వేండామ్ నరసిమ్మన్, మరణించిన రాజమ్మాళ్ దంపతుల కుమార్తె. ఈ దంపతులకు ఐదవ సంతానమైన ఈమె, వరుస గర్భధారణల (ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు) కారణంగా శారీరకంగా బలహీనపడిన తల్లికి జన్మించింది. ఇకపై తమకు మరే సంతానం కలగకూడదని కోరుకుంటూ ఆమె తల్లిదండ్రులు ఆమెకు ‘వేండా’ అని పేరు పెట్టారు. అయితే, ఆమె ఆధార్ కార్డులో మాత్రం ఆమె పేరు ‘వేండామ్’ అని నమోదై ఉంది.
కొన్నేళ్ళ క్రితం ఆమె బతికి ఉన్నప్పుడు జరిగిన ఒక సంభాషణలో, ఆ బిడ్డ మగపిల్లవాడై ఉంటే అతనికి ‘వేండా’ అని పేరు పెట్టేవారం కాదని రాజమ్మాళ్ నాతో చెప్పారు. కానీ వారికి పుట్టింది ఆడపిల్ల; దాంతో ఆమె భవిష్యత్తు జనన ధృవీకరణ పత్రంలోనే ముద్రపడిపోయింది.
అయితే రాజమ్మాళ్ అప్పుడే తన విచారాన్ని వ్యక్తం చేశారు: “మేం నీకు ఒక శుభప్రదమైన పేరు పెట్టి, ‘వేండా వేండా’ అని పదే పదే అనకుండా ఉండుంటే, బహుశా నీ జీవితంలో మరింత అదృష్టం కలిసివచ్చేదేమో,” అని ఆమె తన కుమార్తెతో అన్నారు.
తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో ఉన్న స్వగ్రామం మద్దూరులో, వేండా అనే పేరుతో కనీసం మరో 10 మంది మహిళలు ఉన్నారని వేండా అంచనా వేస్తున్నారు. "తిరుత్తణి బ్లాక్‌లోని మా చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల్లోని మా సముదాయంలో ఈ పేరు ఒకప్పుడు చాలా సాధారణంగా ఉండేది," అని ఆమె PARIతో చెప్పారు.





