మాయి మాసం ముగుస్తుండగా మేం శిమ్గా పండుగ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం. ఏడాదిలోని పన్నెండు నెలలను మా వార్లీ భాషలో చైత్, వైశాఖ్, జేఠ్, ఆఖార్, శ్రావణ్, భాద్వా, ఆశ్విన్, కార్తీక్, మకశీర్, పూస్, మాయి, ఫాల్గుణ్ (దీనిని శిమ్గా అని కూడా పిలుస్తారు) అని పిలుస్తాము.
శిమ్గా నాటికి ఒక వారం లేదా రెండు వారాల ముందు, మేం కర్రలను సేకరించి, హోళీ అని పిలిచే భోగిమంటను వేస్తాం. రాత్రంతా ఆట్యాపాట్యా వంటి సంప్రదాయ ఆటలు ఆడుతూ గడుపుతాం. ఫాల్గుణ మాసం పదిహేనవ రోజైన పౌర్ణమి రాత్రి మేమంతా ఒకచోటకు చేరి చెట్ల కొమ్మలనూ రెమ్మలనూ సేకరించి వాటితో పెద్ద మంటను వేస్తాం. ఈ ఆచారంలో పురుషులు మాత్రమే పాల్గొంటారు. ఆకులతో కూడిన పొడవాటి వెదురు కర్రను అడవి నుంచి తెస్తారు. ఈ కర్రకు ఒక పూల దండను, గాఠీ అని పిలిచే చక్కెర పలుకులు, బియ్యం పేలాల మూటలను కడతారు. ఒక నల్ల కోడిపెట్టకు చెందిన కోడిపిల్లను కూడా దాని కొనకు కట్టేస్తారు. ఈ కర్రను సరిగ్గా మధ్యలో ఉంచి, దాని చుట్టూ అడవి నుంచి సేకరించిన కట్టెలను అమర్చుతారు. ఈ నిర్మాణాన్ని హోళీ అంటారు. ప్రజలు కొబ్బరికాయ కొట్టి హోళీని పూజిస్తారు. గ్రామ పెద్ద పుఢార్ఖీ, గ్రామమంతటా ప్రకటన (దవండీ) చేశాక, హోళీ మంటలను వెలిగిస్తారు.
పూర్వకాలంలో ఊరి జనంతో పాటు చుట్టుపక్కల పల్లెటూళ్ళకు చెందిన ప్రజలందరూ ఒకే భోగిమంటను వెలిగించి, కలిసి పండుగను జరుపుకునేవారు. శిమ్గాకు ముందే వివాహం చేసుకున్నవారు హోళీ మంటల చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణ చేసి పూజలు చేసేవారు. అసలైన ఉత్సవాలు చాలా సరదాగా, పరిహాసాలతో రాత్రివేళ ప్రారంభమవుతాయి. అన్ని వయసులలోని స్త్రీ పురుషులు పరిహాసాలాడుతూ, మేలమాడుకుంటూ, ఒకరితో ఒకరు సరసాలాడుతూ గడుపుతారు. ఈ ఆనందకరమైన వేడుకను మేం ఆ విధంగా జరుపుకుంటాం. రకరకాలుగా వేషాలు వేసుకున్న చిన్నపిల్లలు ఇంటింటికీ వెళ్ళి జనాలను నవ్విస్తారు. దీనికి ప్రతిగా వారు బహుమతులనో, డబ్బునో అడుగుతారు. శిమ్గా పండుగ అందరికీ సంతోషాన్నీ నవ్వులనూ పంచుతుంది.





