"ఒక చీపురు ఏడు అంచెలలో తయారవుతుంది," చెప్పింది భగవతి.
భగవతి వయసు కేవలం 20 ఏళ్ళే అయినప్పటికీ, ఆమెకు తన పని గురించి బాగా తెలుసు. ఆమె తన తల్లి దగ్గర, ఇతర కుటుంబ సభ్యుల దగ్గరా ఈ పనిని నేర్చుకుంది. "ముందుగా మేం ఖర్జూర మట్టలను సగానికి విడదీస్తాం, ఆ తర్వాత వాటి నుంచి ఆకులను తుంచుతాం," ఈ రిపోర్టర్‌కు చెప్పిందామె.
"టుక్డే టుక్డే [చిన్నచిన్న ముక్కలుగా]" ఒక పెద్ద ఈక ఆకారంలో ఉండే మండల నుంచి తుంచిన ఆకులను ఆమె ఇక్కడ సూచిస్తోంది. చీపుర్లు తయారుచేసేవారు ప్రతి ఆకును మండ నుంచి తుంచి వాటిని కట్టలుగా కడతారు. తరువాత వాటిని వెదురు కర్రకు బిగించి, పన్నీ [పాలిథిన్]తో గట్టిగా చుడతారు. ఆకుల ఈనెలు తీసి వాటి అంచులను కత్తిరించడం చివరి దశ అంటూ ఆమె చీపురు తయారుచేయటంలో అన్ని దశలను మాకు వివరించింది. ఆమె అలా చెప్తుండగా ఆమె బంధువైన దేవలీ, అప్పుడప్పుడూ, అవునన్నట్లుగా ఊఁ కొడుతోంది.
తమ తొలి ఇరవైల వయసులో ఉన్న, బంధువులు కూడా అయిన ఈ అమ్మాయిలిద్దరూ చీపురు కట్టడంలోని ప్రతి అంచెనూ గుర్తుపెట్టుకున్నారు. వీరు పంజాబ్‌లోని మలోట్లో ఒక కాలిబాటపై భగవతి తల్లి సోనీ దేవితో కలిసి, ఒకరికెదురుగా ఒకరు వచ్చేట్టు వృత్తాకారంలో కూర్చొనివున్నారు. బాగా సాధన చేసిన నృత్యంలాగా, వారు వంతులవారీగా ఒక్కో అడుగూ వేస్తారు. తరువాతి వ్యక్తికి పనిని అప్పగించే ముందు చీపురు కట్టడంలోని తమ వంతు పనిని పూర్తిచేసి ఇస్తారు.
తమ కుటుంబ వృత్తి పట్ల దేవలీకి ఉన్న ఉత్సాహం ఆమె గొంతులో స్పష్టంగా తెలిసిపోతోంది: "మేం చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే చీపుర్లు కట్టడమంటే మాకు చాలా ఇష్టంగా (బొహొత్ మన్ కర్తే థే) ఉండేది. ఇప్పటికీ అలాగే ఉంటుంది." తన తల్లి రుఖ్మణి నుండి ఈ పనిని నేర్చుకున్న ఆమె, ఇప్పుడు తనకంటే చిన్నవారైన తన ముగ్గురు తోబుట్టువులకు నేర్పాలని చూస్తోంది.
ఆమె బంధువైన భగవతికి కూడా తమ కుటుంబ వృత్తి పట్ల ఆమెకున్నంత ఉత్సాహమే ఉన్నా, ఈమె మరింత అనుభవ జ్ఞానంతో మాట్లాడింది: "క్యోంకి జబ్ మెహనత్ కరేంగే తో తో ఖానే కో మిలేగా ఔర్ మెహనత్ నహీ కరేంగే తో క్యా ఖాయేంగే [ఎందుకంటే నువ్వు కష్టపడి పనిచేస్తేనే నీకు తిండి దొరుకుతుంది, కష్టపడి పని చేయకపోతే ఏం తింటావు]?" అని అడుగుతుందామె. ఆమె తన తల్లి సోనీ దేవి చెప్పే ఈ మాటలు వింటూ పెరిగింది: "మనం చీపుర్లు తయారుచేయకపోతే, ఏం తింటాం?" రాజస్థాన్‌లోని మేవాడ్ ప్రాంతం నుంచి పుంజాబ్కు వచ్చే ఇతర చీపుర్ల తయారీదారులు కూడా ఇదే రకమైన సెంటిమెంటును వ్యక్తంచేశారు.





















