నేను గాంధీనగర్, అలళగపురి గ్రామాలకు వచ్చినప్పుడు ఆ గ్రామాలు రెండూ అందోళనగా ఉన్న జనంతో క్రిక్కిరిసి ఉన్నాయి. ఈ రెండు దళిత (షెడ్యూల్డ్ కాస్ట్) గ్రామాలను విడదీస్తూ మధ్యలో ఒక రోడ్డు ఉంది. అక్కడ అనేకమంది పోలీసులతోపాటు వాహనాలు కూడా ఉన్నాయి. శివకాశి పట్టణంలోని కనిష్క బాణాసంచా కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది కార్మికులు మరణించారనే విధ్వంసకర వార్త, ఈ సముదాయాన్ని తీవ్రంగా కలచివేసింది. చనిపోయినవారిలో ఆరుగురు ఒక్క గాంధీనగర్ గ్రామానికే చెందినవారు, అందరూ దళితులు కూడా.
చనిపోయిన తమ ప్రియమైనవారి కోసం జనం వీధుల్లో రోదిస్తున్నారు. కొంతమంది విరుధునగర్ జిల్లాలోని గ్రామాల్లో ఉండే తమ బంధువులకు ఫోన్ల ద్వారా ఈ వార్తను చేరవేస్తున్నారు.
కొంతసేపటికి, ఆ జనసమూహం శ్మశానం వైపుకు సాగుతుండటంతో, నేను కూడా వారితో కలిశాను. అక్టోబర్ 17, 2023న జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ఆ గ్రామానికి చెందిన ఆరుగురు కార్మికులకు తుది వీడ్కోలు పలికేందుకు గ్రామం గ్రామమంతా శ్మశానానికి తరలివస్తోంది. కాలిపోయిన మృతదేహాలను తొలగించే బాధ్యతలో ఉన్న ఒక అగ్నిమాపక దళ ఉద్యోగి, వాటిని పోస్ట్మార్టం కోసం వెలికి తీయడంలో ఉన్న ఇబ్బందులను వివరిస్తున్నారు.
రాత్రి 8.30 సమయంలో ఆరు ఆంబులెన్సులు శ్మశానవాటిక వద్దకు రావటంతోనే, అక్కడి జనసమూహమంతా దుఃఖంతో కేకలు వేస్తూ వాటివైపుకు పరుగులుతీశారు. ఒక్క క్షణం పాటు నేను నా ఉద్యోగాన్ని మరిచిపోయాను; నా కెమెరాను బయటకు తీయలేకపోయాను. రాత్రి చీకటి కప్పివేసిన ఆ శ్మశానవాటికలో, ఒక దీపం చుట్టూ ఎగురుతోన్న చెదపురుగులు అక్కడ గుంపుకట్టిన గ్రామస్తులలాగా కనిపిస్తున్నాయి.
వారి శరీరాలను బయటకు తీయటంతోనే, ఆ సమూహమంతా వెనక్కు వెళ్ళిపోయింది - మాంసం కాలిన వాసన భరించరానిదిగా ఉంది. కొంతమంది వాంతులు కూడా చేసుకున్నారు. మృతదేహాలు వారి పేర్లు రాసివున్న చీటీలతో వచ్చినందువలన మాత్రమే వాటిని గుర్తించడానికి వీలయింది. జనం దూరంగా వెళ్ళిపోవడంతో, ఆ శ్మశానవాటిక ఒంటరిగా నిలబడిపోయింది.






























