వరదల కారణంగా మొదటిసారిగా తాను మకాం మార్చవలసి వచ్చిన సందర్భం మహేశ్వర్ సమూవాహ్కి స్పష్టంగా గుర్తుంది. అప్పుడతని వయసు కేవలం ఐదు సంవత్సరాలు. “నీటిలో మొదట మా ఇళ్ళల్లో ఒక ఇల్లు కొట్టుకుపోయింది. ద్వీపానికి దగ్గరగా ఉన్న భూమి పైకి మకాం మార్చడం కోసం ఆశ్రయాన్ని వెదుక్కుంటూ మేం మా పడవలలో ఎక్కి తప్పించుకున్నాం,” అని ఇప్పుడు అరవై ఏళ్ళు దాటిన సమూవాహ్ చెప్పారు.
సమూవాహ్ వలె, అస్సాంలోని నదీ ద్వీపమైన మాజులీలో జీవించే 1.6 లక్షల మంది ప్రజలు తరచుగా వచ్చే వరదల వల్ల, భూమి కోతకు గురవడం వల్ల ప్రభావితమవుతున్నారు. 1956లో దాదాపు 1,245 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలోని భూభాగం, 2017 నాటికి 703 చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయిందని జిల్లా విపత్తు నిర్వహణాధికార సంస్థ నివేదిక పేర్కొంది.
"ఇది నిజానికి శాల్మొరా కాదు," చెప్పారు సమూవాహ్. "శాల్మొరాను దాదాపు 43 సంవత్సరాల క్రితం [నది] బ్రహ్మపుత్ర మింగేసింది." బ్రహ్మపుత్ర, దాని ఉపనది సుబన్సిరి ద్వారా కొత్త శాల్మొరా ఏర్పడింది. ఇక్కడ సమూవాహ్ గత 10 సంవత్సరాలుగా తన భార్య, కుమార్తె, కొడుకు కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు.
ఆయన కొత్త ఇల్లు సిమెంటుతోనూ మట్టితోనూ కట్టినది. ఇంటికి బయట కట్టిన మరుగుదొడ్డిని ఉపయోగించడానికి నిచ్చెన ఉపయోగించాల్సిందే. "ఏటేటా మేం బ్రహ్మపుత్రకు కొంత భూమిని నష్టపోతున్నాం," అంటారాయన.








