"ఇక్కడివారిని పెళ్ళి చేసుకున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను."
కొత్త పెళ్ళికూతురిగా తన అనుభవాన్ని 29 ఏళ్ళ రోజీ ఇక్కడ పంచుకుంటున్నారు. ఇలా అనుకోవటంలో ఆమె ఒంటరిదేమీ కాదు. ఇక్కడ నివాసముండేవారిని పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలెవరూ ఇష్టపడటంలేదని శ్రీనగర్‌లోని డల్ సరస్సు ప్రాంతవాసులు చెప్పారు. "మేం ఇప్పటికే మూడుసార్లు తిరస్కరణను ఎదుర్కొన్నాం," తన చిన్న కొడుకుకు వధువు కోసం వెదుకుతోన్న గుల్షన్ నాజిర్ చెప్పారు. "చివరకు పెళ్ళి సంబంధాలు కుదిర్చేవారు కూడా ఇక్కడకు రావటం మానేశారు."
ఈ విడ్డూరానికి కారణం ఏమంటే, రాష్ట్రంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకదానిపై ఆధారపడి జీవించే ఇక్కడి నివాసితులు ఎదుర్కొంటోన్న తీవ్రమైన నీటి కొరత, అని బరూ మొహల్లాకు చెందిన ఈ తల్లి చెప్పారు.
"తొమ్మిదేళ్ళ క్రితం వరకూ మేం మా పడవలను వేసుకొచ్చి డల్ సరస్సులోని వివిధ ప్రాంతాల నుండి నీటిని తీసుకువెళ్ళేవాళ్ళం," అని వడ్రంగిగా పనిచేసే ముస్తాక్ అహ్మద్ చెప్పారు. "అప్పట్లో నీటి ట్యాంకర్లు లేవు."
కానీ గత దశాబ్ద కాలానికి పైగా ముస్తాక్, రాష్ట్ర ప్రభుత్వ నీటి ట్యాంకుల రాక కోసం ఎదురుచూస్తూ ఠంచనుగా 9 గంటలకల్లా రహదారి పైకి వచ్చి నిలబడుతున్నారు. గుడూ మొహల్లాలో నివాసముండే పదిమంది సభ్యులు గల అతని కుటుంబం అతనిపైనే ఆధారపడివుంది. పరిస్థితులను సరళతరం చేసేందుకు ఆయన రూ. 20,000-25,000 ఖర్చు చేసి నీరు నిలవచేసే ట్యాంకులను కొని, పైపులైన్‌ను ఏర్పాటుచేసుకున్నారు. "ఈ ఏర్పాటంతా విద్యుత్ ఉన్నప్పుడే పనిచేస్తుంది. కశ్మీర్లో చలికాలాల్లో విద్యుత్ ఉండటం అనేది పెద్ద సమస్య," అన్నారతను. ఈ నెలలో (మార్చి), ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏదో లోపం వలన వాళ్ళు బక్కెట్లతో నీళ్ళు మోసుకుపోవలసివచ్చింది.






















