మేం అప్పుడే తిన్న అంట్లగిన్నెల్లోని ఒక గిన్నెలోకి గుప్పెడు థార్ ఎడారి ఇసుకను చల్లారు విమల. ఆ గిన్నెను తన చేతుల్లో తిప్పుతూ, గిన్నెలో మిగిలివున్న మెతుకులనూ, జిడ్డునూ బాగా రుద్ది వదిలించారు. "ఇసుకతో గిన్నెలు చాలా బాగా శుభ్రపడతాయి. నీళ్ళతో అంత బాగా శుభ్రం కావు," తన గులాబీ రంగు ముసుగులోంచి చెప్పారామె.
ఎందుకలా? విమల మాట్లాడే ఆ పొడి పొడి హిందీ భాషను నేను అర్థం చేసుకోగలుగుతున్నా, కానీ ఆమె తర్కం మాత్రం నాకు బోధపడలేదు.
"ఇక్కడి నీటిలో NaCl [సోడియం క్లోరైడ్, అంటే ఉప్పు] పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది," నా స్నేహితురాలు, 27 ఏళ్ళ పుష్ప చౌహాన్ మాట కలిపింది. ఆ రోజుకు నాకు అనువాదకురాలిగా వ్యవహరిస్తోన్న ఆమె విమలకు మరదలు. "మేం నీటిని వాడితే, పాత్రలపై మరకలు అలాగే ఉండిపోతాయి. ఇక్కడి నీరు భారీ గానూ, ఖారా గానూ [భారంగా, ఉప్పగా] ఉంటుంది."
ప్రపంచంలోని తొమ్మిదవ అతిపెద్ద ఉప ఉష్ణమండల ఎడారికి స్వాగతం! ఇక్కడి భూగర్భ జలాల ఉప్పదనానికి ఒక భౌగోళిక వివరణ ఉంది. ఇక్కడ వర్షపాతం కంటే బాష్పీకరణ (ఆవిరైపోవటం) తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉండటం వలన ఇక్కడి నేలలోనూ నీటిలోనూ లవణాలు, ఖనిజాలు నిక్షిప్తమవుతాయి. ఈ ఎడారి గుజరాత్, రాజస్థాన్లతో పాటు సరిహద్దుకు ఆవలి వైపున ఉన్న పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల వరకు విస్తరించి ఉంది.
ఈ ఎడారి నడుమ, రాజస్థాన్లో కొత్తగా (2023) ఏర్పడిన ఫలోదీ జిల్లాలో దయా కోర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం అంచున విమల ఇల్లు ఉంది. సరిగ్గా ఆ ఇంటి బయట, 32 ఏళ్ళ విమలా దేవి ముంగాళ్ళపై కూర్చుని, పాత్రలను శుభ్రం చేస్తున్నారు.












