"మేం గుదొక్ను వడ్డించకుంటే చాలామంది మా కస్టమర్లు మా హోటల్లో తినరు," అన్నారు చందన్ చక్మా. గత ఎనిమిదేళ్ళుగా 37 ఏళ్ళ చందన్, ఆయన భార్య శమారు (36) వాళ్ళ హోటల్లో గుదొక్ను వడ్డిస్తున్నారు. పులియబెట్టిన చేపలు, కూరగాయలతో తయారుచేసే గుదొక్ అనే ఈ వంటకం త్రిపురలోని ఊనకోటి జిల్లాలోని చక్మా సముదాయపు సంప్రదాయ వంటకం
తమ గ్రామమైన శాంతినగర్‌లో జెస్సికా హోటల్‌ను నడుపుతోన్న ఈ జంటకు వివాహమై ఇప్పటికి 20 ఏళ్ళవుతోంది. వారికి 12వ తరగతి చదివే జెస్సిక, 8వ తరగతి చదివే చెవన్నే అనే ఇద్దరు అమ్మాయిలున్నారు.
"మా గుర్తింపుకు గుదొక్ కేంద్రబిందువు," అంటారు చందన్. త్రిపురలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసివున్న చక్మా సముదాయం జనాభా, తాజా జనాభా లెక్కల ప్రకారం సుమారు 80,000.
తమ హోటల్లో ఏడాది పొడవునా అందరికీ ఇష్టమైన వంటకంగా గుదొక్ ఉంటుందని ఈ జంట తెలిపింది. మూడు గదుల నిర్మాణమైన జెస్సికా హోటల్ ఒకేసారి 40 మందికి భోజన వసతి అందించగలదు. ఇంకా రూ. 100 నుంచి రూ. 160 మధ్య ధరకే థాలీలను (పూర్తి భోజనపు పళ్ళేలు) అందించగలదు. ఈ థాలీలలో వడ్డించే సంప్రదాయక గుదొక్ ఒక జనాదరణ పొందిన వంటకం.
"తాము ఇంటికి తీసుకెళ్ళడానికి వీలుగా గుదొక్ని విడిగా అమ్మమని జనం మమ్మల్ని తరచుగా అడుగుతుంటారు," అన్నారు చందన్. ఆయన తన ఇంటి వద్ద కూడా ఈ వంటకాన్ని తయారుచేస్తారు. "ఇక్కడ నివసించే అన్ని సముదాయాల ప్రజలు దీనిని ఇష్టపడతారు," అని ఆయన చెప్పారు. వీరిలో హాలామ్, మోగ్, దేబ్బర్మ వంటి తెగలకు చెందినవారితో పాటు శాంతినగర్‌లో నివసించే బెంగాలీ మాట్లాడే ప్రజలు కూడా ఉన్నారు. వీరిలో చాలామంది దశాబ్దాల క్రితమే బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినవారు.
అందరూ అమితంగా ఇష్టపడే గుదొక్ను కూరగాయలతోనూ, పులియబెట్టిన చేపలతోనూ వండుతారు. ఈ పులియబెట్టిన చేపలను స్థానికంగా బెర్మా లేదా శిదోల్ అని పిలుస్తారు. ఇంకా పూఁటి (పూంటియస్ సొఫోర్) ఫ్యాఁసా (సెటిఫిన్నా ఫాసా) జాతుల చేపలను కూడా ఉపయోగిస్తాం. "ఫ్యాఁసా శిదోల్కు ఒక ప్రత్యేకమైన ఘాటైన రుచి ఉంటుంది కాబట్టి దానిని వాడతాం," అన్నారు చందన్. ఆయన శిదోల్ను స్థానిక మార్కెట్ నుంచి కిలోగ్రాము ఒకటికి రూ. 500కు కొంటారు.










