లక్ష్మణ్ బైఠా బావమరిది లక్ష్మణ్‌కు ఫోన్ చేసి, అతని భార్యకు అస్వస్థతగా ఉందని చెప్పగానే, లక్ష్మణ్ మరేమీ ఆలోచించకుండా తన ఊరికి వెళ్ళే రైలెక్కారు.
యాభై ఏళ్ళ వయసున్న ఈ వలస కార్మికుడు రాళ్ళు చెక్కే ఒక కర్మాగారంలో పనిచేసేందుకు తరచుగా బిహార్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తుంటారు. తన భార్య అనారోగ్యం గురించిన వార్త తెలియగానే ఆయన ఒక టిక్కెట్టు కొనుక్కొని రైలులో రిజర్వేషన్ లేకుండానే తన ప్రయాణాన్ని సాగించారు. 2,000 కిలో మీటర్ల దూరం ప్రయాణించి పశ్చిమ చంపారణ్ జిల్లాలోని తన గ్రామమైన జిమ్రికి చేరుకోవటానికి ఆయనకు రెండు రోజులు పట్టింది.
చివరకు ఆయన ఇల్లు చేరేసరికి తన భార్య ఆరోగ్యం మెరుగుపడినట్టు కనిపించి కొంత తేలికపడ్డారు. కాని ఆమె ఆయన్ని కౌగలించుకొని ఏడవటం మొదలుపెట్టారు. "నాకేమీ అర్థం కాలేదు. ఎందుకేడుస్తున్నావని నా భార్యను అడిగాను," అన్నారు లక్ష్మణ్ ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ.
"ఒక పులి మన అబ్బాయి రాజ్‌కుమార్‌ను చంపేసింది," వణికిపోతోన్న గొంతుతో చెప్పారు చందావతి దేవి. నలభై ఏడేళ్ళ వయసున్న ఆమె, అప్పుడా వార్త వినగానే సొమ్మసిల్లి పడిపోయారు, దాంతో ఆమె భర్త ఇంటికి రావలసివచ్చింది.






