గత ఏడేళ్ళుగా నేను పారిశుద్ధ్య కార్మికుల జీవితాలను, పోరాటాలను ఛాయాచిత్రాల ద్వారా నమోదుచేస్తున్నాను. ఇన్నేళ్ళలో ఈ పారిశుద్ధ్య కార్మికులు సరైన మాస్కులు లేదా రక్షణ పరికరాలను ధరించి తమ పనిని చేయటాన్ని నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఏ కొద్దిపాటి ఉపకరణాలనో వారు వాడినా కూడా, అవి వాళ్ళు స్వయంగా తయారుచేసుకొని ఉపయోగించుకుంటున్నవే.
భారతదేశంలో శాస్త్రీయ పురోగతి అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పటికీ, మనం భూగర్భ మురుగు కాలువల్లోకి మనుషులను పంపుతూనే ఉన్నాం. అక్కడ వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తారు, తరచుగా ప్రాణాలు కోల్పోతారు కూడా. విజ్ఞానశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, మన సమాజంలో కుల వివక్ష మాత్రం ఇంకా లోతుగా పాదుకొనిపోయి ఉందని ఇది స్పష్టం చేస్తుంది.
కోవిడ్ మహామారి, ప్రకృతి వైపరీత్యాల వంటి అసాధారణ పరిస్థితులలో మాత్రమే సమాజం పారిశుద్ధ్య కార్మికులను "ముందువరుస శ్రామికులు"గా గుర్తుపెట్టుకుంటుంది. మిగిలిన అన్ని సమయాలలో వాళ్ళు కేవలం చెత్తను తొలగించేవారుగా మాత్రమే గుర్తుంటారు.
2025 ఆగస్టు 1 నుండి 13 వరకు, పారిశుద్ధ్య కార్మికులందరూ చెన్నైలోని నగర మునిసిపల్ సంస్థ, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రధాన కార్యాలయమైన రిప్పన్ భవనం వెలుపల పారిశుద్ధ్య పనులను ప్రైవేటుపరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఒక నిరంతర నిరసనకు కూర్చున్నారు. పదమూడవ రోజున, తమిళనాడు ప్రభుత్వం పోలీసుల సహాయంతో వారిని అక్కడ నుంచి బలవంతంగా ఖాళీ చేయించింది.
ఈ ప్రాంతాలలో ఘన వ్యర్థాల నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నిర్ణయించిన తరువాత, 5 (రాయపురం). 6 (తిరు వి. కల్యాణసుందరం నగర్) జోన్లకు చెందిన కార్మికులు ఆగస్టు 1 నుండి తమ నిరసనను తెలుపుతున్నారు.
ఏళ్ళ తరబడి నగరాన్ని శుభ్రం చేయడంలోనే గడిపిన ఈ కార్మికులకు - వీరిలో ఎక్కువమంది దళిత మహిళలు - ప్రైవేటీకరణ అంటే కేవలం వేతనాల ప్రశ్న కాదు, అది వారి గౌరవానికీ మనుగడకూ సంబంధించినది. కార్పొరేషన్లో ప్రత్యక్ష ఉపాధికల్పనను కోల్పోవడం అంటే ప్రస్తుత కార్మిక చట్టాల ప్రకారం శాశ్వత స్థాయిని పొందే అవకాశాన్ని కూడా కోల్పోవడం. వారి ప్రతిఘటన జీవనోపాధి కోసం చేసే పోరాటమే కాక, కానరాని తమ శ్రమను, సామర్థ్యం పేరుతో మరింత విలువ తగ్గించడానికి చేస్తోన్న ప్రయత్నాన్ని నిరాకరించడం.


























