గాలిలో మట్టి వాసన, కాలుతున్న కలప నుండి వచ్చే పొగ వాసన అలుముకున్నాయి. సిమెంట్ చేసివున్న నేలంతా తెల్లటి మరకలు ఉన్నాయి. అవి అక్కడే ఒక పెద్ద తొట్టిలో నిల్వ చేసిన తెల్లటి బంకమట్టి ముద్దల వలన వచ్చాయి. అచ్చులు, సగం పూర్తయిన మట్టి పాత్రలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి; నడవడానికి స్థలమే లేదు. “కొంచెం చూసి జాగ్రత్తగా అడుగు వేయండి,” హమీద్ అహ్మద్ అందరికీ పదేపదే గుర్తు చేస్తున్నారు.
పన్నెండేళ్ళ బాలుడొకడు సారెను తిప్పుతూ, వేగాన్ని ఎలా నియంత్రించాలో నేర్చుకుంటున్నాడు. అతను హమీద్ కొడుకు మొహమ్మద్ సల్మాన్; అతని ఒంటి నిండా తెల్లటి బంకమట్టి దుమ్ము ఉంది. ఆ చిన్నవాడు, తన కుడి కాలుతో భూమి లోపల ఉన్న సారెను తిప్పుతూ, తన ఎడమ కాలును ముందుకి చాచి, దృష్టినంతా కేంద్రీకరించి శ్రద్దగా పని చేస్తున్నాడు.
“(కుండను) నెమ్మదిగా తియ్యి,” హమీద్ అతనికి సూచనలిచ్చారు. చరిత్ర పునరావృతమవుతోంది; తన తండ్రి నుండి విలక్షణమైన కిక్-వీల్ సాంకేతికతను నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు, ఈ 49 ఏళ్ళ నిపుణుడైన కుమ్మరికి కేవలం తొమ్మిదేళ్ళే. “మొదట్లో నేను తయారుచేసిన కొన్ని పాత్రలను విరగ్గొట్టాను,” అతను నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. “ఇది సాధనతోనే వస్తుంది.”
పదిమంది సోదరులలో ఒకరైన ఆయన, ఏడవ తరానికి చెందిన బంకమన్ను కళాకారుడు. ఉత్తరప్రదేశ్లోని ‘సిరామిక్ నగరం’గా పేరు గాంచిన ఖుర్జాలో, ప్రస్తుతం ఆయన కుటుంబం మాత్రమే ఈ తరహా మట్టి పనిని కొనసాగిస్తోంది. విలక్షణమైన కుండల తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో వీటిని ఎక్కువగా ముస్లిములు తయారుచేస్తారు.



















