2012లో వివాహం అయిన కొద్ది కాలానికే అంజు రాణి జీవితం అస్తవ్యస్తం కావడం మొదలైంది. "నా భర్త మద్యానికి బానిస కావడం వల్ల, మేం ప్రతిరోజూ గొడవపడేవాళ్ళం. దాని వల్ల నేను లోలోపలి నుండి కుంగిపోయాను," అన్నారు ఇద్దరు బిడ్డల తల్లి అంజు (34).
ఆమె భర్త ఇంటి ఖర్చుల కోసం డబ్బులేమీ ఇచ్చేవాడుకాదు. "మా విద్యుత్ బిల్లులను తరచూ బాకీ పడుతుంటాం," అన్నారామె. "అప్పులు పేరుకుపోయాయి, వడ్డీ వ్యాపారులు ఇంటికి వచ్చి మమ్మల్ని వేధించేవాళ్ళు. ఆ రోజులను నేను భయం భయంగా గడిపేదాన్ని."
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని సియానా పట్టణంలో నివసించే అంజు అత్తమామల ఇంటికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే అయాద్నగర్ గ్రామంలోని తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు, అంజు ఇరుగుపొరుగువారు గానీ, బంధువులుగానీ ఆమె వైవాహిక జీవితం ఆమెపై పెడుతోన్న ఒత్తిడిని ఎప్పుడూ పట్టించుకోలేదు. వాళ్ళెప్పుడూ అంజును తన భర్త వద్దకు తిరిగి వెళ్ళిపోవాలని ఒత్తిడిపెట్టేవారు. చాలా ఏళ్ళపాటు అంజు తన కూతురితో పాటు తన భర్త వద్దకు తిరిగి రావాల్సి వచ్చేది.
అంజు తండ్రి 15 ఏళ్ళ క్రితం కేన్సర్‌తో మరణించటంతో ఆమె తల్లి అప్పటినించీ ఒంటరిగా జీవిస్తున్నారు. "ఒక రోజున నేను అన్నీ వదిలేసి నా పుట్టింటికి వచ్చేశాను. అతనెప్పుడూ నా కోసమని రాలేదు, నేను కూడా వెనక్కి తిరిగి వెళ్ళలేదు," నులకతో అల్లిన చార్‌పాయి(మంచం) మీద తన తల్లి పక్కనే కూర్చొని ఉన్న అంజు చెప్పారు.
పంటకాలంలోనూ, పని దొరికినప్పుడూ ఆమె వ్యవసాయ కూలీగా పనిచేయటం ప్రారంభించి రోజుకు రూ. 200 నుంచి రూ. 250 వరకూ సంపాదించటం మొదలెట్టారు.
2017లో మరోసారి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమెకు ఆ తర్వాత మరో అమ్మాయి పుట్టింది. "నేను తిరిగి నా జీవితాన్ని నేను జీవించే ప్రయత్నం చేశాను, కానీ ఈ రెండో పెళ్ళి మరింత ఘోరంగా మారింది. ఈ భర్త కూడా తాగి నన్ను కొట్టేవాడు. అతను తాగటం కోసం ఇంట్లోని నిత్యావసర వస్తువులను, మొదట తిండిగింజలను, ఆ తర్వాత కూలర్, చివరకు నా కుట్టు మిషన్‌ని కూడా, అమ్మేశాడు. ఆ తర్వాత జనం ఇళ్ళల్లో దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. నాకు చాలా అవమానంగా అనిపించేది."









