లాక్డౌన్ సమయం విశాఖపట్నం నుంచి సరాసరి మా ఇంటికి రావటానికి 12 రోజులు నడిచాం," 2020 నాటి కోవిడ్-19 భయంకర అనుభవాన్ని తలచుకుంటూ అన్నారు కయిల్ భుయాఁ (45). అప్పుడాయన అగనంపూడిలోని లార్సన్ & టుబ్రో నిర్మాణ ప్రదేశంలో రోజువారీ కూలీగా పనిచేసేవారు.
ఝార్ఖండ్ వరకూ సుమారు 1000 కిలోమీటర్లు అలా నడిచివారిలో పదిమంది స్త్రీలు, నలుగురు పిల్లలతో సహా మొత్తం 80 మంది ఉన్నారు. "మేం రాత్రింబగళ్ళూ నడిచాం. అలసిపోయినప్పుడల్లా ఒక గంటసేపు నిద్రపోయి, మళ్ళీ నడక మొదలుపెట్టేవాళ్ళం." ఝార్ఖండ్ రాష్ట్రంలోని పలామూ జిల్లాలో ఉన్న రబ్‌దా గ్రామం వరకూ...
సుమారు ఆరేళ్ళ తర్వాత కయిల్ అటువంటిదే మరొక ప్రయాణానికి - ఈసారి రైలులో, దేశ రాజధాని ప్రాంతం నుండి - మరొక భయానక వాస్తవం వైపు తిరిగి వెళ్ళటానికి పూనుకున్నారు.
ఆయన తాను తీర్చలేని అప్పులో పీకల్లోతున కూరుకుపోయారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌లు చేస్తోన్న యుద్ధం కారణంగా ఏర్పడిన ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి) సిలిండర్ల తీవ్ర కొరత వల్ల వలస కార్మికులు అత్యంత తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.
ఈ మార్చి ప్రారంభంలో, "మరో లాక్డౌన్ రాబోతుందని అందరూ అనటం మొదలుపెట్టారు," ఆయన గుర్తుచేసుకున్నారు. ఆయన నోయిడాలోని ఎల్&టి నిర్మాణ ప్రదేశంలో రోజుకు రూ. 500 కూలీకి తాపీ పని చేస్తున్నారు.
ఆ తర్వాత ఎల్పిజి ధరలు కిలో 90 రూపాయల నుండి 300 రూపాయలకు మూడు రెట్లు పెరిగాయి. “వంట చేసుకోవడానికి మేం షట్టరింగ్ సామాగ్రిని, ప్లైవుడ్‌ను మండించాం,” ఆయన చెప్పారు. “ఎలాగోలా నెట్టుకొచ్చాం.” అది కూడా కేవలం పది రోజుల పాటు మాత్రమే.








