పొలాల్లోకి పులి వస్తే శుభసూచకమని మా కోర్కూ సమాజంలో నమ్ముతాం. దాని పాదముద్రలు రైతు సంపదలకు సూచన. అంతటా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
నా పేరు రామ్‌లాల్. మహారాష్ట్రలో, మేళ్ఘాట్ టైగర్ రిజర్వ్ (ఎమ్‌టిఆర్) బఫర్ ప్రాంతంలోని పాయ్విహీర్ గ్రామంలో జన్మించాను. నేను, వసంత్ ఎమ్‌టిఆర్ ప్రధాన ప్రాంతంలోని బోరాత్యాఖేడా గ్రామంలో నివసిస్తాం. మేమిద్దరం కోర్కూ ఆదివాసులం. మా కుటుంబాలు తరతరాలుగా ఈ అడవుల్లోనే నివసిస్తున్నాయి.
ఆవుల, ఎద్దుల పేడలో పులి పంజా గుర్తులు కనిపించడం శుభసూచకం అన్న నమ్మకంతో మేం పెరిగాం. ఆ గుర్తులు ఉండే పిడకను ధాన్యాగారంలో మేం జాగ్రత్తగా భద్రపపరుచుకుంటాం. దాని ఉనికి వల్ల, ఇంట్లో ఎప్పుడూ ధాన్యానికి కొరత ఏర్పడదని నమ్ముతాం.
మేం ఎక్కువగా మొక్కజొన్న, జొన్న, వరి, గోధుమ, చిరుధాన్యాలు, సోయాచిక్కుళ్ళు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కంది, పెసర, శనగ, ఇంకా ఇతరత్రా పప్పుధాన్యాలను పండిస్తాం. వీటిలో ఎక్కువ భాగాన్ని మాకోసం వినియోగించుకొని, కొంత భాగాన్ని మాత్రమే అమ్ముతాం. మా సముదాయంలో, చాలామంది రైతులకు అటవీ భూమిని సాగు చేయడానికి వ్యక్తిగత అటవీ హక్కులు ఉన్నాయి. సాగునీటి కోసం మేం వర్షంపైనే కాకుండా, సమీపంలోని వాగులు, బావులపై కూడా ఆధారపడతాం.
















