చుట్టూ చీకట్లు ఆవరించే సాయంత్రం పేరే నాకు పెట్టారు. అయితే, 'సంధ్య' [సాయంత్రం] అనేది నల్లని నా ఒంటి రంగుకు తగిన పేరని నా కుటుంబం భావించింది.
నేను నల్లగా పుట్టడంతో, నా కుటుంబం నాపై ఏమంత ప్రేమ కురిపించలేదు. ఇది నా చిన్నప్పటి అనుభవం. దీని వల్ల చర్మం రంగు కారణంగా ఎలాంటి వివక్ష ఎదుర్కొంటామనే విషయంపై నాకు అవగాహన కలిగింది; అది అలా నాతో నిలిచిపోయింది.
నేను 1996లో, ఝార్ఖండ్‌లోని సంఘరీ గ్రామంలో నివసించే ఒక ముండా ఆదివాసీ కుటుంబంలో పుట్టాను. మా అమ్మ నిర్మల కెర్కెట్టా, మా నాన్న సుమన్ లక్రా. ఝార్ఖండ్-బీహార్ సరిహద్దు ప్రాంతంలోని చత్రా జిల్లాలో ఉండే మా ఇంటి చుట్టూ అడవులు, నదులు, వాగులు ఆవరించి ఉన్నాయి.
నా తల్లిదండ్రులు రైతులు. మాకు రెండెకరాల భూమి ఉంది. అందులో, సీజన్‌ను బట్టి బెండకాయలు, చిక్కుళ్ళు, బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, క్యారెట్ల వంటి కూరగాయలను పండిస్తాం. వరిని కూడా పండిస్తాం. కానీ, వీటి నుండి మాకు పెద్దగా ఆదాయమేమీ రాదు. వీటితో పాటు మా నాన్న రోజువారీ వ్యవసాయ కూలీగా, రోడ్ల నిర్మాణం, గొట్టపు బావులు తవ్వడం లాంటి పనులు చేసి సంపాదించే ఆదాయాన్ని కూడా కలుపుకుంటే, మా వార్షిక ఆదాయం సుమారు రూ.30,000 ఉంటుంది.
మా తల్లిదండ్రులు మహువా [మధుకా లాంగిఫోలియా లేదా లాటిఫోలియా - ఇప్ప] పూలతో తయారుచేసిన మద్యాన్ని అమ్ముతారు. అలా వచ్చిన డబ్బు ఆరుగురు సభ్యులున్న మా కుటుంబాన్ని పోషించటంలో సహాయపడుతుంది. నాకు ఇద్దరు అక్కలు, ఒక సోదరుడు ఉన్నారు. మా చదువులకు సహాయంగా ఉంటుందని గ్రామంలో ఒక చిన్న మిఠాయి దుకాణాన్ని కూడా వాళ్ళు నడుపుతున్నారు.
దాదాపు 15 మంది సభ్యలుండే పెద్ద కుటుంబంలో బతకడం అంటే, ఎప్పుడూ బండెడు చాకిరీ ఉంటుంది. నేను ఎదుగుతున్న క్రమంలో, నా సొంత ఇంట్లోనే నేనొక పనిపనిషిలా పనిచేయాల్సివచ్చేది. 2వ తరగతిలో ఉన్నప్పటికే, సుమారు ఏడేళ్ళ వయసులో, నేను ఇంటి పనులన్నీ - మొత్తం కుటుంబానికి వంట చేయడం, గిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం, గోశాలను శుభ్రం చేయడం, ఆవులను, మేకలను మేతకు తీసుకువెళ్ళడం, అడవి నుంచి కట్టెలు సేకరించడం… ఇలా ఇంకెన్నో – చేసేదాన్ని.


















