“రైలు ఐదు నిమిషాలు మాత్రమే ఆగుతుంది, మేం చాలా రద్దీ నడుమ రైల్లోకి ఎక్కుతాం. కొన్నిసార్లు రైలు కదలడం మొదలవుతుంది, అప్పుడు మేం ప్లాట్‌ఫామ్‌పై కొన్ని మూటలను వదిలేయాల్సివస్తుంది." సారంగ రాజ్భోయ్ తాళ్ళు తయారుచేస్తారు. ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్లాట్‌ఫామ్ మీద విడిచిపెట్టే మూటలు, ఆమెలాంటి మహిళలు తాళ్ళుగా తయారుచేసి అమ్ముకునే వస్త్ర కర్మాగారాలలో మిగిలిపోయిన ఫైబర్ (పీచు) ముక్కలు. వీళ్ళు తయారుచేసే తాళ్ళను ఆవులను, గేదెలను కట్టేయడానికి, ట్రక్కులు, ట్రాక్టర్లలో సరుకులను కట్టడానికి, చివరికి బట్టలు ఆరవేసుకునే తాళ్ళుగా కూడా ఉపయోగిస్తారు.
"హమారా ఖాన్‌దానీ హై [మాది కుటుంబ వ్యాపారం]" సంత్రా రాజ్భోయ్ చెప్పారు. అహ్మదాబాద్‌లోని వట్వాలో మునిసిపల్ హౌసింగ్ బ్లాక్‌లో ఉన్న తన ఇంటికి సమీపంలోని ఒక బహిరంగ ప్రదేశంలో కూర్చునివున్న ఆమె, సింథటిక్ ఫైబర్ చిక్కులను విప్పదీయడంలో తలమునకలై ఉన్నారు.
సారంగ, సంత్రాలు గుజరాత్‌లోని రాజ్భోయ్ సంచార తెగకు చెందినవారు. వాళ్ళు అహ్మదాబాద్ నుండి సూరత్‌కు ప్రయాణం చేస్తూ, దారిలో ఉన్న వస్త్రాల మిల్లుల నుంచి ఫైబర్ వ్యర్థాలను కొంటారు, తర్వాత వాటిని తాళ్ళుగా పేనుతారు. ఈ పని కోసం వాళ్ళు రాత్రి పదకొండు గంటలకు ఇంటి నుండి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి తిరిగి వస్తారు. వీళ్ళు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు తమ పిల్లలను బంధువులు, ఇరుగుపొరుగు వారి సంరక్షణలో వదిలి వెళ్తారు.
వాళ్ళు ఎక్కే రైళ్ళు తరచుగా తెల్లవారుజామున ఒకటి లేదా రెండు గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటాయి. అందువల్ల తాళ్ళు తయారుచేసే ఈ మహిళలు రైల్వే ప్లాట్‌ఫామ్‌ల మీదు పడుకుంటారు, అలాంటప్పుడు వీళ్ళకు తరచూ వేధింపులు తప్పవు. “మమ్మల్ని రెండు మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచి ఎక్కడి నుంచి వచ్చామని ప్రశ్నిస్తారు. పోలీసులు పేదలనే కదా పట్టుకునేది,” అని కరుణ అన్నారు. "ఒకవేళ వాళ్ళు మమ్మల్ని నిర్బంధించాలనుకుంటే, వాళ్ళు ఆ పనీ చేస్తారు."
కరుణ, సంత్రా, సారంగ అందరూ వట్వాలో ఉన్న చార్ మాలియా మున్సిపల్ హౌసింగ్‌లో పక్కపక్కనే ఉంటున్నారు. తమ ఇళ్ళలో సాధారణ నీటి సరఫరా, మురుగునీటి సదుపాయం వంటి కనీస సౌకర్యాలు లేవని వీళ్ళు తెలిపారు. ఎంతో కాలం పోరాడితే కానీ వీళ్ళకు విద్యుత్ కనెక్షన్లు రాలేదు.


























