ఉదయం ఐదుగంటల సమయం, సూర్యుడింకా తన దినచర్యను మొదలుపెట్టకముందే, బిహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఉన్న హథువా అనే ఈ చిన్న జనగణన పట్టణాన్ని రెండు విశిష్టమైన శబ్దాలు నిద్రలేపుతున్నాయి. వాటిలో ఒకటి, కొన్ని మసీదుల మీనార్ల నుండి మువాజిన్లు వినిపించే అజాన్ పిలుపు; మరొకటి, ఆ ప్రాంతంలోని మూడు నాలుగు ఆలయాల నుండి వినిపించే భజన గాయకుల స్వరాలు. అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్! అష్షద్ అన్ లా ఇలాహా ఇల్లా అల్లాహ్... అనే మధుర స్వరాలు, చేతాళాల లయలతో సాగే హరే రామ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే రామ అనే భజన గానంతో కలిసిపోతున్నాయి. ఆ తర్వాత, అక్కడే ఎక్కడో కాస్త సమీపం నుంచే గాలిలో అనునాదం చెందుతోన్న వేణుగానం, ఆ విభిన్న స్వరాలన్నింటినీ కలిపి ఒక స్వచ్ఛ సమ్మేళనాన్ని సృష్టిస్తోంది.
బాఁసురీ (వేణువు) వినిపించే ఆ మధుర రాగం పట్ల ఆకర్షణ, ఆ కళాకారుడిని కలుసుకోవాలనే కుతూహలం నన్ను 176 ఏళ్ళ నాటి ఆ గోపాల మందిరానికి నడిపించాయి. 1850 - 1866ల మధ్య అప్పటి హథువా మహారాణి శ్యామ సుందరి కుఁవర్ నిర్మించిన ఈ ఆలయం చుట్టూ పాత కోట, ఒక కొత్త కోట, శీశ్ మహల్ (అద్దాల రాజమందిరం) ఉన్నాయి. సుమారు 4,50,000 వెండి నాణేల వ్యయంతో - ఇప్పటి విలువలో సుమారు 55 కోట్ల రూపాయలు - నిర్మించిన ఈ రాజసం ఉట్టిపడే ఆలయ భారీ ద్వారాల వద్ద ఒక భద్రతా సిబ్బంది కాపలా కాస్తుంటారు. 14 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రాంగణం లోపల తోటలు, ఫౌంటైన్లు, కొలనులు, సంస్కృత విశ్వవిద్యాలయ భవనం, అనేక గదులతో కూడిన ఆ ప్రసిద్ధ ఆలయం ఉన్నాయి.
ఈ ఆలయం, పూర్వపు హథువా సంస్థానాన్ని పాలించిన అత్యంత పురాతన ఉన్నత వంశాలలో ఒకదానికి చెందిన వారసుల వ్యక్తిగత ఆస్తి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచే ఈ ఆలయానికి ఆ సమయాల్లో కొద్దిమంది భక్తులు రావడం కనిపిస్తుంది. గర్భగుడిలోని రాధాకృష్ణుల విగ్రహాల ముందు ఒక పూజారి ఆరతి ఇస్తుంటారు. దానికి ఎదురుగా ఉన్న స్తంభాలతో కూడిన విశాలమైన హాలులో సంగీతకారులు తమ వాయిద్యాలైన తబలా, హార్మోనియం, చేతాళాలతో కూర్చుని ఉంటారు. ఆ బృందం మధ్యలో మహమ్మద్ సగీర్ అన్సారీ ఉన్నారు. నేను నా సహోద్యోగుల ద్వారా విన్నది ఈ కళాకారుడి గురించే.
గోపాల మందిరంలోని దేవతలకు తన వేణువును సమర్పిస్తోన్న 70 ఏళ్ళ ముస్లిమ్ సంగీతకారుడు. తన పనిలో ఆయనకు అసాధారణమైనదేమీ కనిపించదు. "మానవులందరూ సమానులే. మన మధ్య ఎలాంటి భేదం లేదు," అంటారాయన. “మనమందరం సామరస్యంగా జీవించాలి. యహ్ ఏక్ గ్యాన్ హై జో ఖుదానే ముజే దియా హై. ఔర్ గ్యాన్ బంట్నే మేఁ కుఛ్ భీ గలత్ నహీ హై [ఈ కళ, ఈ జ్ఞానం ఖుదా అనుగ్రహం. దీన్ని పంచుకోవడంలో తప్పేమీ లేదు]. ఇప్పటికి దశాబ్దానికి పైగా నేనిక్కడ వేణుగానం చేస్తున్నాను."







