వహ్ యా పెద్దవారి అరచేతిలో సులభంగా ఇమిడిపోతుంది. వహ్ (వెదురు) నుంచి తయారైన ఈ సంగీత పరికరం కేవలం నాలుగున్నర అంగుళాల పొడవుంటుందనీ, "ప్రేమకు ప్రతీక" అనీ ఆ చిన్న వెదురు ముక్కను తన పెదవులకానించుకుంటూ అంటారు నప్ లో.
నప్ ఒకప్పుడు నాగాలాండ్‌లోని మొన్ జిల్లాకు చెందిన ఒక రైతు. మాతో మాట్లాడుతూనే ఆమె తన చిన్న సంగీత పరికరాన్ని బయటకు తీశారు. తన ఎడమ చేతితో ఆ వెదురు చివరనూ, దారపు పురినీ పట్టుకున్నారు. కుడి చేతితో ఒక చివరన రంగురంగుల దారపు ముక్కలు వేలాడుతోన్న తాడును పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని వాయించటం మొదలెట్టారు.
నప్ పక్కనే కూర్చున్నవారు ఆమె చిన్ననాటి స్నేహితులైన యింగ్ లీహ్, నీలై. వీరంతా అరవయ్యేళ్ళు దాటినవారు. వీరు ముగ్గురూ కలిసి మొన్ గ్రామంలోని బాప్టిస్ట్ చర్చ్ పక్కనే ఉన్న మైదానంలో జరిగే అవ్లేంగ్కు వెళ్తారు.






