"ఎప్పుడో అరవైయ్యేళ్ళ క్రితం కుష్ఠు వ్యాధి వచ్చిన వ్యక్తిని ఇప్పుడు తాకితే కూడా తమకు ఆ వ్యాధి సోకుతుందని ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు.”
డెబ్బైల వయసులో ఉన్న నియమతుల్లా ఖాన్ కుష్టు వ్యాధిని జయించి ఆరు దశాబ్దాలకు పైగా అయ్యింది, కానీ అది తెచ్చిన కళంకం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉందన్నారాయన. "నా కుటుంబం నన్ను గౌరవంగా చూస్తోంది. కానీ నా ఆరోగ్య పరిస్థితి కారణంగా నేను ఇతరుల దగ్గరి నుండి అదే గౌరవాన్ని ఆశించలేకపోతున్నాను," ఆయన కారణాన్ని వివరించారు.
జాలి, అసహ్యంతో నిండిన చూపులను భరించలేక చివరికి 2025లో ఆయన కుప్వారాలోని తన ఇంటినీ కుటుంబాన్నీ వదిలి, శ్రీనగర్‌లోని బెహ్రార్ లెప్రసీ కాలనీకి వెళ్ళిపోయారు.
“నేను ఇక్కడికి రావడానికి కారణమేంటంటే, ఇక్కడ అందరూ సమానమే. ఇక్కడ, నా ఊరిలో లాగ నన్ను వెలివేస్తున్నట్లుగా అనిపించడం లేదు,” 76 ఏళ్ళ నియమత్ తెలిపారు. “ఈ చోటు నా సొంత ఇంటిలా అనిపిస్తుంది. అందుకే, నా చివరి శ్వాస వరకు ఇక్కడే బతకాలని నిర్ణయించుకున్నాను.”
















