పట్నా వీధుల గుండా ఆ గాజు సిపార్ పోతూవున్నప్పుడు, కాంతులు వెదజల్లే గోపురం ఆకారపు నిర్మాణం కన్నుల విందుగా ఉంటుంది. “కత్తుల నుండి కవచాల వరకు – పదునైన కత్తి మొనలను కూడా చీల్చేట్టు కనిపిస్తోన్న అనార్ (అలంకారక దానిమ్మపండ్లు)తో సహా – ప్రతిదీ గాజు నుంచి తొలిచినదే,” నగరానికి గర్వకారణమయిన శీశే కి సిపార్ గురించి చెప్పారు, నజ్రే ఇమామ్.
అనేక సంక్లిష్టమైన వివరాలతో కూడివున్న ఈ గాజు సిపార్ పట్నాలో ముహర్రం ఊరేగింపుల సమయంలో కనిపిస్తుంది. ఒకప్పుడు యుద్ధభూమికి తీసుకెళ్ళే అలంకరించిన ఆయుధశాలను పోలి ఉండే ఈ సిపార్లో కత్తులు, కవచాలు, విల్లులు, బాణాలు వంటి అన్ని రకాల ఆయుధాలుంటాయి. వీటి తయారీ వెనుక, కనీసం ఒక డజను కళారూపాల నుంచి తీసుకున్న అలంకారక మూలాలున్నాయి.
పట్నా నగరానికి దక్షిణంగా సుమారు ఒక కిలోమీటరు దూరంలోని పాత బాఘ్ కాలూ ఖాన్ ప్రాంతంలో ఉన్న తన కార్యశాలలో సిపార్ తయారీని పూర్తి చేసిన 40 ఏళ్ళ మొహమ్మద్ నిసార్, తన కుమార్తెలతో పాటు కార్యశాల తలుపు వద్ద నిల్చొని, తాను తయారుచేసినదానిని చూసుకుంటున్నారు. సున్నితమైన ఆయన సృష్టిని అక్కడ వరండాలో నిలిపివుంచారు. ఆయన కార్యశాలకు దగ్గర్లో కొన్ని ఇళ్ళు, ఒక మజార్ (ప్రార్థనాస్థలం) ఉన్నాయి.
“ఇదేమీ ఒక మనిషి చేసే పని కాదు,” కళాకారుడైన నిసార్ అన్నారు. “ఇది అనేక కళా నైపుణ్యాల సమ్మేళనం. కొన్ని బిహార్‌కు చెందినవి, మరికొన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవి.”
ఆరి, జర్దోజీ, కషీదాకారి, ఛాపా, నగ్, కొన్నిసార్లు మీనాకారి వంటి కళానైపుణ్యాలను సిపార్లో చూడవచ్చని ఆయన ఉదహరించారు. (ఆరి అంటే వంపు తిరిగిన సూదిని ఉపయోగించి వస్త్రంపై క్లిష్టమైన డిజైన్లను కుట్టే పద్ధతి; జర్దోజీ అంటే మెటల్ దారాలను ఉపయోగించి చేసే కుట్టుపని; కషీదాకారీ అంటే బిహార్‌లో చేసే కశ్మీరీ శైలి కుట్టుపని; ఛాపా అంటే చెక్క బ్లాక్‌ల సహాయంతో మెటాలిక్ రంగులతో వస్త్రాలపై అచ్చు వేసే పద్ధతి.)
ఈ సిపార్లో మీనాకారి (ఎనామిల్ పెయింటింగ్)తో పాటు చక్కగా చెక్కి, పదునుపెట్టిన విలువైన రాళ్ళను అతికించే నగ్ కళ కూడా ఉంటాయి.



















