"నేను యువతిగా ఉన్న సమయంలో, దీన్ని ఆపేస్తామనే ఆలోచనే మాకు రాలేదు."
అయితే, రాధా దేవి ఇంటి అటక మీద పడివున్న దుమ్ముకొట్టుకుపోయిన పనిముట్లు మరో కథను చెప్తున్నాయి. ఎన్నడూ అద్దకం వేయని సహజమైన ఉన్నితో కంబళ్ళను నేయటంలో దశాబ్దాల పాటు ఆమెకు తోడుగా ఉన్న రాట్నం, పాతబడిపోయిన చెక్క నాడె వంటి పనిముట్లు ఇప్పుడు నిశ్శబ్దంగా పడి ఉన్నాయి.
"సూతా బనావత్ కే కళా హమార్ హాథ్ సే ఛూటత్ జాతా [నూలు వడికే నైపుణ్యం నా చేజారిపోతోంది]," నూలు వడకటంతో పాటు నేత పని కూడా చేసే భోజ్పుర్కు చెందిన రాధా దేవి అంటున్నారు. "అప్పుడు [2016లో] నేసింది తప్ప ఇంతవరకూ నేను ఒక్క కంబళి కూడా నేయలేదు." ఆమె చూపిస్తోన్న లేత, ముదురు గోధుమ రంగులు కలిసివున్న ఆ కంబళి మందంగా, మధ్య మధ్య చారల డిజైన్‌తో ఉంది.
"నేను చాలా చిన్న వయసు నుండే మా మాయి [అమ్మ], చాచీ [అత్త], దాదీ [నానమ్మ] లతో కలిసి ఈ కంబళ్ళను తయారుచేస్తున్నాను," కచ్చితంగా తన వయసెంతో గుర్తులేని రాధా దేవి చెప్పారు. అయితే, "మేం ఇందిరా గాంధీ కాలాన్ని చూశాం!" అని మాత్రం ఆమె చెబుతున్నారు.
గర్హనీ బ్లాక్‌లోని భిన్రారీ గ్రామ వీధులు ఒకప్పుడు గొర్రెల ఉన్నితో చేసిన ఉత్పత్తులతో కళకళలాడుతూ ఉండేవి. చలికాలం రాగానే, పాల్ సామాజిక వర్గానికి చెందిన చేనేత కళాకారులు నేసిన కంబళ్ళు చేతులు మారుతుండేవి, ఈ ముతక ఉన్ని పోగుల కంబళ్ళు చలికాలపు సుదీర్ఘ రాత్రులలో వెచ్చదనాన్ని ఇచ్చేవి. ఇప్పుడా మార్కెట్ల జీవకళ దాదాపుగా కనుమరుగైపోయింది. ఆ గ్రామంలోని తన సామాజిక వర్గంలో అలాంటి కంబళ్ళను నేసిన చివరి మహిళ రాధా దేవి.
"ఎహీ జాత్ బా హమార్ [ఇదే మా కులం]," అంటారు రాధా దేవి. "మొదటి నుండీ మేం చేస్తోన్న పని ఇదే."
ఆకుపచ్చ, గులాబీ రంగుల చీర కట్టుకుని, ఎండకు వేడెక్కిన తన ఇంటి ఇటుకల గోడకు ఆనుకుని నిలబడి ఉన్న రాధా దేవి ఎనిమిది తొమ్మిదేళ్ళ వయసులో తాను కంబళ్ళు నేయడాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టిన సంగతి గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ బడికి వెళ్ళని ఆమె, ఈ నైపుణ్యాన్ని తన తల్లి నుండి నేర్చుకుంది. ఆమె తండ్రికి, తాతకు వందకు పైగా గొర్రెలు ఉండేవి. సాధారణంగా, కుటుంబంలోని మహిళలు ఉన్నితో కంబళ్ళు, స్వెటర్లు నేసేవారు; పురుషులు వాటిని సమీప గ్రామాలలో, కొన్నిసార్లు ఇతర జిల్లాలలో కూడా అమ్మేవారు. తన పెళ్ళి తర్వాత కూడా అదే ఏర్పాటు కొనసాగడాన్ని ఆమె చూశారు - ఆమె భర్త, మామగారు గొర్రెలను పెంచుతుండగా, ఆమె అత్తగారు కంబళ్ళు నేసేవారు.












