నేను శబర్పారా చేరేసరికి రాత్రయింది. బాందోయాన్ తాలూకాలోని కూఁచియా గ్రామం అంచున, పదకొండు ఇళ్ళు రహదారికి దూరంగా ఉన్నాయి. అది శబర్ (సబర్ అని కూడా పిలుస్తారు) సమూహానికి చెందిన చిన్న మట్టితో కట్టిన నివాసాల సమూహం.
సగం చీకటిలో చిక్కుకున్న వారి ఇళ్ళు, దుయార్సిని కొండలతో కలిసిపోతున్నకొద్దీ మరింత దట్టంగా మారిపోతోన్న అడవికి ప్రారంభ బిందువుగా ఉన్నాయి. సాల, సెగున్ (టేకు), పియాల్ (చిరోంజీ), పలాశ్ (మోదుగు) చెట్లతో కూడిన ఈ అడవి పండ్లు, పువ్వులు, కూరగాయల వంటి ఆహారానికీ, జీవనోపాధికీ మంచి వనరు.
శబర సముదాయాన్ని పశ్చిమ బెంగాల్లో డి-నోటిఫైడ్ (DNT) తెగగానే కాకుండా, షెడ్యూల్డ్ తెగగా కూడా జాబితా చేశారు. వలసవాద బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ (CTA) ద్వారా 'నేరస్థులు'గా ముద్రవేసిన అనేక తెగలలో వీరు కూడా ఉన్నారు. 1952లో భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయటంతో ఆ తెగలను ఇప్పుడు డి-నోటిఫైడ్ తెగలు (DNTs) లేదా సంచార తెగలు (NTs)గా సూచిస్తున్నారు.
ఈనాటికి కూడా శబర్పారా (సబర్పారా అని కూడా పిలుస్తారు)లోని ఈ కుటుంబాలు అడవిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వారిలో 26 ఏళ్ళ నేపాలీ శబర్ ఒకరు. ఆమె తన భర్త ఘల్టూ, ఇద్దరు కుమార్తెలు, పసివాడైన కొడుకుతో కలిసి పురూలియా జిల్లాలోని తన మట్టి ఇంట్లో నివసిస్తోంది. అందరికంటే పెద్దదైన తొమ్మిదేళ్ళ కుమార్తె ఇప్పటికీ 1వ తరగతిలోనే ఉంది. రెండవ సంతానం తప్పటడుగుల చంటిబిడ్డ, అందరికంటే చిన్నది తల్లి పాలు తాగే పసిబిడ్డ. ఈ కుటుంబ సంపాదన మొత్తం సాల (షోరియా రోబస్టా) ఆకులపై ఆధారపడి ఉంటుంది.




