పొద్దుపొద్దున్నే తన పూరింటి బయట కూర్చొని ఉన్న 48 ఏళ్ళ గోమతి వీరయన్ తన కుటుంబం కోసం త్వరత్వరగా భోజనం తయారుచేస్తున్నారు. మదురై జిల్లా, సీర్కాళి తాలూకాకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే తాండవణ్కుళంలోని అణ్ణా నగర్ దళితవాడలో ఇది చాలా సాధారణ దృశ్యం. ఈ ప్రాంతంలో నివసించే అందరు మహిళల మాదిరిగానే గోమతికి కూడా తెల్లవారుఝాముకు చాలా ముందుగానే, ఉదయం నాలుగు గంటలకు, పని దినం మొదలవుతుంది. ఆమె మామూలుగా చేసే ఉదయపు పనులలో దగ్గరలో ఉన్న కొళాయి నుంచి మంచినీళ్ళు తీసుకురావటం, ఇరుకిరుగ్గా ఉండే ఇంటిని శుభ్రం చేయటం, ఆరుబయట కట్టెల పొయ్యి మీద వంట చేయటం ఉంటాయి.
"గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయి, కానీ ఇది చాలా చవకైనది," అలవాటైన సులువుతో కుండను తిప్పుతూ వివరించారు గోమతి. తన భర్త, అత్త, కొడుకుల కోసం ఉదయపు అల్పాహారం, మధ్యాహ్న భోజనం తయారుచేయటం పూర్తయేసరికి తాను తినటానికి ఆమెకు సమయం మిగలదు.
ఓడరేవులో తాను చేపలను ఎండబెట్టే పనిచేసే పళైయాఱుకు ఆమె వడివడిగా అడుగులేశారు. ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఆమె ఒక రోజులో చేసే పనిని నదీ లయలు, చంద్రకళలు శాసిస్తాయి.
ఒకరి తర్వాత ఒకరుగా మహిళలు తమ ఇంటి పనులను ముగించుకుని, అలల పాటు తక్కువగా ఉండే సమయానికి నది ఒడ్డుకు చేరుకుంటారు. ఆరోజు వారి పని పళైయాఱులో చేపలను ఎండబెట్టడమైతే, ఎనిమిది గంటలకల్లా వారు బస్సు ఎక్కడానికి సమీపంలోని బస్ స్టాండ్‌కు వెళ్తారు. వారు పనిచేసే సమయం అలలపై ఆధారపడి ఉంటుంది. "పళైయాఱు మా ప్రజల జీవనరేఖ! ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ అదే ఆధారం," అని పళైయాఱు ఓడరేవులో చేపలను ఎండబెట్టే గోమతి చెప్పారు.
పళైయాఱు, కొళ్ళిడం నది ముఖద్వారం వద్ద ఉండే ఒక చేపల ఓడరేవు. ఈ నది బంగాళాఖాతంలో కలుస్తుంది. మయిలాడుతుఱై జిల్లా (2020లో నాగపట్టిణం జిల్లా నుండి వేరుపడింది)లో ఉండే ఈ ఓడరేవు తమిళనాడులోని 12 చేపల ఓడరేవులలో ఒకటి. ఇది జీవనోపాధి కోసం చేపల వేటపై ఆధారపడిన సమీప గ్రామాల నుండి వచ్చే వేలాదిమంది కార్మికులకు ఆసరాగా నిలిచింది.
గోమతి వీరయన్ పళైయాఱు చేపల ఓడరేవులో గత కొన్నేళ్ళుగా చేపలను ఎండబెడుతున్నారు. "మహిళల జీవితాలు ఈ ఓడరేవుతో గాఢంగా పెనవేసుకుపోయాయి," గోమతి వివరించారు. "మేం ఇక్కడ పుట్టాం, ఇక్కడే పెళ్ళి చేసుకున్నాం, ఇక్కడే జీవిస్తున్నాం. ఇంతకుమునుపు మేం పొలం పనులు చేసేవాళ్ళం. వరి, చిరుధాన్యాలు, కాయ ధాన్యాల నాట్లు వేసేవాళ్ళం. కానీ ఇప్పుడా అవకాశం లేదు. అయితే అతివృష్టి, లేదా అనావృష్టి. పంటలు పాడైపోయాయి.”
ఆమె ఇంకా ఇలా అన్నారు, "నాకు 15 సంవత్సరాల వయసప్పటి నుండే నదిలోకి దిగి చేతులతో చిన్నరొయ్యలను [కరిడియా] పట్టుకునేదాన్ని. మా అమ్మ, అత్త కూడా ఇదే పని చేశారు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆసక్తిగా రొయ్యలను పట్టేదాన్ని. ఇలా వచ్చిన ఆదాయం నా పిల్లల చదువుకు ఆసరా అయింది. బతికి ఉన్నంత కాలం, నేను రొయ్యలను పట్టుకుంటూనే ఉంటాను."
ఓడరేవు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆమె నివాసముండే ప్రాంతానికి చెందిన 20 మందికి పైగా మహిళలు కూడా ఈ పనినే చేస్తున్నారు. "మహిళలంతా ఉదయం 6 గంటల బస్సు ఎక్కి పనికి వెళతారు. మేం రొయ్యలను, చేపలను, స్క్విడ్ (ఎరగా ఉపయోగపడే ఒక రకం చిన్న చేప)లను నాలుగైదుసార్లు శుభ్రంచేసి, ఉప్పు వేసి, నిల్వచేసి, ఎండబెట్టి, ప్రతి రకాన్ని విడిగా ప్రాసెస్ చేసి కట్టలు కడతాం," అని పరయర్ (రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేయబడింది) సముదాయానికి చెందిన గోమతి చెప్పారు.




















