"ఈ నీళ్ళు కంపు కొడుతున్నాయి, కానీ మాకు వేరే దారేముంది?"
సూర్యాస్తమయం అవుతుండటంతో, బచ్చాదేవి దిల్లీలోని యమునా నదిలో మునిగేందుకు సిద్ధమయ్యారు. ప్రతి ఏటా నవంబర్ మొదటి వారంలో సూర్యుడు, నీరు, గాలి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే ఛఠ్ మహాపర్వ్ ను జరుపుకోవడానికి నోయిడా, దిల్లీ, ఫరీదాబాద్ నుంచి వచ్చి, కాళిందీ కుంజ్ ఘాట్ వద్ద గుమిగూడిన అనేకమంది జనంలో ఆమె కూడా ఒకరు. "మాకు ఛఠ్ అనేది దీపావళి కంటే పెద్ద పండుగ," అని రాజేశ్ మండల్ చెప్పారు. 45 ఏళ్ళ రాజేశ్ బిహార్లోని ఖగారియా నుంచి దిల్లీకి వలస వచ్చారు.
నాలుగు రోజుల పాటు జరిగే ఛఠ్ పూజలో మూడవ రోజైన సంధ్యా ఆర్ఘ్య అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజు వివాహిత మహిళలు సుమారు రెండు గంటల పాటు నడుము లోతు నీళ్ళలో మునిగి, అస్తమించే సూర్యుడిని ప్రార్థిస్తారు. ఈ మునకల కోసం దిల్లీ పరిసర ప్రాంతాలలో ఉండే భక్తులకు, ప్రమాదకరంగా కలుషితమైన యమునా నది తప్ప వేరే గత్యంతరం లేదు.



















