ఒక పాత కొయ్య జీను, ఒక పాత మగ్గం, పోలో ఆటలో వాడే చెక్క గూటం, గడ్డి చెప్పులు, పాత వెండి నగలు, పెళుసెక్కి పొడిపొడి కాబోతున్న శీనా కవిత్వపు రాతప్రతి, వివాహాల్లో మహిళలు ఆభరణాలుగా వాడే సంప్రదాయిక దువ్వెనలు ఇంకా మరెన్నో ఉన్నాయక్కడ. బషీర్ అహ్మద్ టీరూ తన వస్తుప్రదర్శనశాలలో ప్రదర్శిస్తోన్న ఈ ప్రాచీన వస్తువులన్నీ, వాళ్ళ రోజువారీ జీవితంలో భాగాలు.
గురేజ్లోనూ ద్రాస్లోనూ ఎక్కువగా నివసించే దర్ద్-శిన్ తెగకి చెందినవారు బషీర్. గత అయిదేళ్ళనుంచీ, దావర్లో ఆయన పరిరక్షిస్తూ, నిర్వహిస్తోన్న దర్ద్-శిన్ వస్తుప్రదర్శనశాలకు గురేజ్ లోయ అంతటినుంచీ ప్రజలు తమ అమూల్యమైన వారసత్వ సంపదను, ఇతర పాత వస్తువులనూ అందజేస్తున్నారు.
“పనికిరానివనుకుంటూ, చాలామంది తమ ఇళ్ళలోని పాత బట్టలను తగలబెట్టడాన్నీ, పాత వస్తువులను, వాడకంలో లేని పొలం పనిముట్లనీ పారేయడాన్నీ చూశాను,” గుర్తు చేసుకున్నారాయన. అందుకనే, ఒకప్పుడు పనికిరానివి, పాతబడినవి అనుకుని పారేసేవీ, కాల్చేసేవీ ఇప్పుడు అతని వస్తుప్రదర్శనశాలలో పదిలం అవుతున్నాయి.
తన ప్రజల చరిత్రను ప్రదర్శించే వస్తుప్రదర్శనశాలను నిర్వహించడంలో, ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తగా తాను చేస్తున్న ఉద్యోగం తనకు తోడ్పడుతోందని బషీర్ నమ్ముతారు. ప్రజలు తనమీద ఉంచిన నమ్మకం వల్లనే, ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం తనకు సులభమైందని ఆ 44 ఏళ్ళ ప్రభుత్వ ఉద్యోగి చెప్తున్నారు. సంవత్సరంలో ఆరు నెలల పాటు కురిసే శీతాకాలపు మంచువల్ల, కశ్మీర్లోని గురేజ్ లోయ ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. దానికి తోడు అక్కడ అందుబాటులో ఉండే ప్రభుత్వ ఆరోగ్యసదుపాయాలు కూడా అంతంతమాత్రమే. బషీర్ వంటి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు అందించే సేవలు చాలా ముఖ్యమైనవి కావటంతో, ఆయన పట్ల ప్రజలకు పరమ నమ్మకం..


















