"శిల్ కటా-ఆ-వ్!"
ఉత్తర సోనార్పూర్ సమీపంలోని గరియా అనే ప్రాంతంలో లాల్‌బాబు మహాతో గొంతు బిగ్గరగా, కీచుగా ప్రతిధ్వనిస్తోంది. అది మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయం, అతని గొంతు తప్ప అక్కడ వినిపిస్తోన్న ఒకే ఒక శబ్దం, ఇక్కడ కొల్‌కతాకు సమీపంలోని మార్కెట్లో సాగుతోన్న పిచ్చాపాటీ కబుర్లు మాత్రమే.
"శిల్ కటా-ఆ-వ్!" అతను మళ్ళీ పిలుస్తూ, తమ శిల్ నోరాపై కక్కు కొట్టించుకోవాలనుకునే వారి పిలుపు కోసం ఆశిస్తూ ఆ సందులో చురుకుగా నడుస్తున్నారు. బెంగాల్లో శిల్ కటావో అనేది గ్రానైట్ రాతి సన్నికల్లు – శిల్, చేతితో నూరటానికి ఉపయోగించే రాయి – నోరా మీద డిజైన్లు చెక్కే ఒక సంప్రదాయక పని. శిల్ బట్టా లేదా తమిళంలో అమ్మి కల్లు అనే ఒక రకమైన శిల్-నోరాను, భారతీయ వంటకాలలో ప్రధానమైన మసాలా దినుసులను సువాసనగల తడిముద్దగానూ, పొడిగానూ నూరడానికి ఉపయోగిస్తారు. గట్టి శిల్ మీద స్థిరంగా నోరా ఒత్తిడి పడినప్పుడు మాత్రమే మూలికల, మసాలా దినుసుల నిజమైన రుచి బయటపడుతుందని భారతీయ వంటవారు నమ్ముతారు.
"మసాలాను మరింత మెత్తగా చేయటమే దాని ప్రధానమైన పని. ఎలాంటి అధునాతనమైన మిక్సర్ అయినా అటువంటి నాణ్యతను ఇవ్వలేదు," ఈ ముఖ్యమైన వంటగది సాధనం గురించి లాల్‌బాబు చెప్పిన మాటలివే.
“వృత్తిగా శిల్ కటావో (కక్కుకొట్టడం) పనిని చేపడుతున్న కొత్తవారు దాదాపుగా ఎవరూ లేరు. మేమే ఈ వృత్తిలో చివరి తరం,” అని బిహార్‌లోని సీవాన్ జిల్లా నుండి వలస వచ్చిన లాల్‌బాబు అంటున్నారు. “సుమారు పదేళ్ళ క్రితం నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు, ఒక్క ఖిదిర్పూర్లోనే మా వాళ్ళు 250 మంది ఉండేవారు. ఇప్పుడు వారిలో చాలామంది వృద్ధులైపోయారు, ఈ పనిని మానేశారు; ఇలాంటి శ్రమతో కూడిన పని చేయడానికి వారిప్పుడు పనికిరారు.”












