"ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయి కొన్నేళ్ళయింది. చికిత్స నిమిత్తం నేనామెను 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాంలోని శిల్చార్కు తీసుకువెళ్తుంటాను; చాలా తరచుగా, నెలకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఆమెను అక్కడికి తీసుకెళ్ళాల్సి వస్తుంది. దీని కోసం నేను ఇప్పటికే సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశాను. ఈ డబ్బును నేను అప్పుగా తీసుకోవాల్సి వచ్చినందున, ఇప్పుడు నేను అప్పుల ఊబిలో కూరుకుపోయాను. నా పనస చెట్లలో చాలావాటిని కలప కోసం అమ్మేసినప్పటికీ నా పరిస్థితి ఇలాగే ఉంది. నేను అమ్మిన చివరి చెట్టుకు నాకు 4,000 రూపాయలు వచ్చాయి," రతీశ్ చెప్పారు.
రతీశ్కు వడ్రంగి పని దొరికినప్పుడు, రోజుకు రూ. 500 సంపాదిస్తారు. నెల చివరకు ఆయన గరిష్టంగా, సుమారు ఏడు వేల రూపాయలు సంపాదించగలుగుతారు. అయితే, ఒక్క పని కూడా దొరక్క, వరుసగా రెండు మూడు నెలల పాటు ఖాళీగా ఉండాల్సిన సందర్భాలు కూడా ఆయనకు ఎదురవుతుంటాయి. "ఆ విధంగా నేను దోతారాలను అమ్మడానికి ధర్మనగర్ వెళ్ళడం మొదలుపెట్టాను. అది నా జీవనోపాధికి ఏకైక మార్గంగా మారింది. నా దగ్గర చెప్పుకోదగ్గ పొదుపు ఏమీ లేదు. నగరంలోని ఒక నగల దుకాణంలో పనిచేసే నా పెద్ద కొడుకు, తన శక్తిమేరకు నాకు సహాయం చేస్తుంటాడు," రతీశ్ వివరించారు. ఆయనకు నలుగురు పిల్లలు - ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె - తమ తల్లిని చూసుకోవడానికి ఆసుపత్రికి పదే పదే తిరిగే బాధ్యతను స్వయంగా చూసుకుంటున్నారు. అతని చిన్న కుమార్తె రిమిత (17), ఇంకా హైస్కూల్ చదువులోనే ఉంది.
సంగీతమే ఈ కళాకారుడి మనసుకు సాంత్వననిచ్చే ఏకైక విషయం. "నా మనసులో ఒక నిర్దిష్టమైన పాటనో రాగాన్నో ఎంచుకుని, ఆ తర్వాత దాన్ని నా సొంత బాణీలో వాయిస్తాను. నాకెప్పుడూ ఎవరూ వాయించటమెలాగో నేర్పించలేదు. నేను దోతారా వాయించడానికి కూర్చున్నప్పుడు, సమయం గురించిన స్పృహే ఉండదు. ఈ పని చేస్తూ నేను జీవనోపాధి సంపాదించుకోవాల్సి వస్తుందని ఒక్కసారి కూడా ఊహించలేదు. సుమారు ఐదేళ్ళ క్రితం నేను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దోతారాలు తయారుచేసి అమ్మడం ప్రయత్నించమని ఎవరో సూచించారు." ఇప్పటి వరకు ఆయన పదమూడు దోతారాలను అమ్మారు. ఒక్కో దోతారాకు సుమారు ఐదు వేల రూపాయలు సంపాదిస్తారు. "ఒక్కో వాయిద్యానికి ముడి పదార్థాలకే సుమారు రూ. 2,000 ఖర్చవుతుంది. అయితే, నేను మొట్టమొదటిసారిగా తయారుచేసిన దోతారాను ఈ రోజు వరకు అమ్మలేదు. అది నాకు ఎంతో ప్రియమైనది," ముఖం వెలిగిపోతుండగా రతీశ్ చెప్పుకొచ్చారు.
ఇప్పుడాయనకు వినియోగదారులున్నారు. "నాకు సంగీతమంటే చాలా ఇష్టం, రతీశ్ ఒక అద్భుతమైన సంగీతకారుడు. అతను దోతారాలు తయారుచేస్తాడని తెలిసిన వెంటనే, నేను వెంటనే వెళ్ళి నా కోసం ఒకటి తయారుచేయమని అడిగాను," సైన్స్ ఉపాధ్యాయుడైన సురేంద్ర నాథ్ (45) అన్నారు. రతీశ్ మొట్టమొదటి వినియోగదారుడు ఆయనే. మరిన్ని డోతారాలు తయారుచేయమని ఆయన రతీశ్ను ప్రోత్సహించడమే కాకుండా, ఒక స్థానిక క్లబ్లో ప్రదర్శన ఇవ్వడానికి కూడా అతన్ని ఆహ్వానించారు.