మెహబూబ్ తన కుటుంబంతో కలిసి, జూన్ నెల ప్రారంభంలో జరిగే ఈద్ అల్-ఆధా పండుగ జరుపుకోవటం కోసం ఈ మే నెలలో బాలియా హసేన్నగర్కు తిరిగివచ్చారు. వారి రెండున్నర అంతస్తుల ఇంటిని ఈ తాపీ మేస్త్రీ కుటుంబం ఏళ్ళ తరబడి ఇటుక మీద ఇటుకగా నిర్మించింది. ఈ ఇంటిలో ఐదు గదులున్నాయి, భవిష్యత్తులో దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి కింది అంతస్తులో కొంత స్థలం ఉంది. మెహబూబ్ తన భార్య, గృహిణి అయిన సుర్నా బీబీ (30), వారి ముగ్గురు పిల్లలతో నివసించే భాగానికి బయటా లోపలా కూడా ప్లాస్టరింగ్ చేయలేదు. బడికి వెళ్ళటం మానేసిన వారి పెద్ద కొడుకు బకుల్ షేక్ (16) దగ్గరలోనే ఉన్న దుకాణంలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారులైన సాగర్ షేక్ (12), రేహాన్ షేక్ (7) స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. పవిత్ర ఖుర్బానీ సందర్భంగానూ, మెహబూబ్ ఇంటికి తిరిగి వచ్చినందుకూ, అతని కుటుంబం ఆచారపరంగా నిర్వహించే బలి ఏర్పాట్లు కూడా చేసింది.
అయితే అదంతా జరగలేదు. "ఠాణేలోని నిర్మాణ ప్రదేశం నుండి పదే పదే కాల్ చేసి," అతన్ని తిరిగి రమ్మని చెప్పారు. మెహబూబ్ తన కుటుంబాన్నీ, పండుగ సంబరాలనూ వదిలేసి మహారాష్ట్రకు వెళ్ళిపోయి తిరిగి పనిచేయటం మొదలుపెట్టారు.
జూన్ 9న, ఆయన ఒక టీ దుకాణం దగ్గర టీ తాగుతుండగా, ఎలాంటి వివరణా ఇవ్వకుండా పోలీసులు ఆయనను పట్టుకుపోయారు. ఆయనను ఠాణేలోని మీరా రోడ్లో ఉన్న శ్రీ ఎల్ ఆర్ తివారీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న ఔట్‌పోస్టుకు తీసుకువెళ్ళారు. రాత్రి సమయంలో ఆయనను మీరా రోడ్ పోలీస్ స్టేషన్‌కు మార్చి, ఆయన పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలు చూపించమని అడిగారు.
"అధికారులు నన్ను 'నువ్వొక బంగ్లాదేశీవి, అవునా?' అని హిందీలో అడిగారు. 'నేను పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చాను,' అని చెప్తూ వారికి నా ఆధార్, పాన్ కార్డులను చూపించాను. 'ఈ రోజుల్లో వీటిని ఐదు రూపాయలకు కూడా కొనుక్కోవచ్చు,' అని వాళ్ళన్నారు," అని మెహబూబ్ ఈ రిపోర్టర్‌తో చెప్పారు.
ఏదో విధంగా అతను బలియా హసేన్నగర్లోని తన కుటుంబానికి దొంగతనంగా ఫోన్ చేశారు, వారు వెంటనే స్థానిక మహిషస్థలి గ్రామ పంచాయతీని సంప్రదించి, అవసరమైన అన్ని పత్రాలను మీరా రోడ్ పోలీస్ స్టేషన్‌కు పంపారు. "నాలుగు దీర్ఘమైన రోజుల పాటు నేను తీవ్రమైన మానసిక హింసను భరించాను. పగటిపూట నన్ను స్టేషన్ బయట కూర్చోబెట్టి, రాత్రివేళల్లో పోలీసు శిబిరంలో ఉంచేవారు," అన్నారు మెహబూబ్.
మీరా రోడ్ పోలీసులు మెహబూబ్ తమపై చేసిన ఆరోపణను ఖండిస్తున్నారు. సీనియర్ ఇన్స్పెక్టర్ మేఘనా బురాడే, తాము 'తప్పు చేయలేద'ని ప్రకటించారు. మెహబూబ్ షేక్‌ను, మరికొంతమందిని పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకే అదుపులోకి తీసుకున్నామని అన్నారు.