హైదరాబాద్ పాత నగరంలో మీరు లక్క గాజులు ఎక్కడ దొరుకుతాయని ఎవరినైనా అడిగితే, వాళ్ళు నగర లాడ్ బజార్ (లక్క బజారు)లో ఉండే ఉస్మాన్ కా కారిగారి వైపు చూపిస్తారు. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ దుకాణంపై పేరు రాసివుండదు; కొంచెంగా తుప్పు పట్టిన లోహపు షట్టర్ని తెరిస్తే చుట్టూ మూడు గోడలున్నగది కనిపిస్తుంది. అందులో లక్క గాజులు చేసే నైపుణ్య కార్మికులైన షేక్ అఖీల్, షేక్ హజీల్ కూర్చొని ఉంటారు. వారిద్దరి మధ్యా ఎత్తు తక్కువగా ఉన్న ఒక లోహపు బల్ల ఉంటుంది.
ఈ అన్నదమ్ములిద్దరూ ఒక దశాబ్ద కాలానికి పైగా ఈ గాజులను తయారుచేస్తున్నారు, ఒక్కొక్కరూ రోజులో 500 గాజుల వరకూ చేస్తారు. వివిధ స్థాయిలలో తయారై వున్న లక్క గాజులు అక్కడంతా పడివున్నాయి. "గులాబీ రంగు బాగా ప్రజాదరణ పొందినది," గాఢమైన గులాబీ రంగు అద్దకం వేసి ఉన్న ఒక లక్క ఫలకాన్ని తీసుకుంటూ చెప్పారు అఖీల్. ఈ గులాబీ రంగుతో పాటు నలుపు, బంగారు రంగు, టర్కోయిజ్ నీలి రంగు, ఇంకా అనేక రంగుల్లో, మెరిసే గాజు పూసలు పొదిగిన ఈ గాజులు, పారదర్శకంగా ఉండే సెల్లోఫేన్ డబ్బాలలో పేర్చివున్నాయి.
చార్మీనార్ దగ్గరలోని లాడ్ బాజార్ ఇరుకు సందులలో ఉన్న కార్యశాల కూడా అయిన ఈ దుకాణం పాతగిలిపోయిన కొయ్య, ఇత్తడి వాసన వేస్తోంది. అఖీల్, హజీల్లు తమ పనిని మొదలుపెట్టగానే దగ్గరలోనే ఉన్న మసీదు నుంచి వస్తోన్న ఆజాఁ, పిల్లలు ఆడుకునే చప్పుళ్ళు సద్దుమణిగాయి. తమ పనిలో మునిగిపోయి నిశ్శబ్దంగా పనిచేసుకోవడానికి ఇష్టపడే ముప్ఫై ఏళ్ళు పైబడిన ఈ సోదరులిద్దరికీ ఈ ఒక్క పని చేయటమే తెలుసు.
ఈ దుకాణం తమ బంధువైన ‘ఉస్మాన్’ పేరు మీద ఉందని వీరు PARIతో చెప్పారు. "ఈ దుకాణం సొంతదారు అతనే కానీ, ఆయన ఇక్కడ పనిచెయ్యరు. నేనూ నా సోదరుడు మాత్రమే ఇక్కడ పనిచేస్తాం," అఖీల్ చెప్పారు. అందుకు తాము ఎలాంటి అద్దె చెల్లించటంలేదని అని కూడా అన్నారాయన














