తాను పని చేసుకుంటున్నప్పుడు ఫోటోలు తీసుకుంటామని వచ్చే సందర్శకులు నవీన్ కుమార్ టమ్టాకి అలవాటే. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో రాగి కళాకృతులపై, ఇళ్ళలో వాడుకునే రాగి వస్తువులపై చక్కటి డిజైన్లను రూపొందించటంలో యాభైల వయసులో ఉన్న ఈ రాగి కళాకారుడు ప్రసిద్ధి చెందారు.
టమ్టా, వందలాది ఏళ్ళ క్రితం రాజస్థాన్ నుండి హిమాలయాల్లోని కుమావూఁ ప్రాంతానికి వచ్చిన రాగి పనివారి సుదీర్ఘ పరంపరకు చెందినది. వారి మొదటి స్థిరనివాసం, లోహాఘాట్లోని గోస్నీ గ్రామానికి సమీపంలో ఉంది. తర్వాత, చంపావత్నుంచి అల్మోరాకు రాజధాని మారేక, రాగి పనివారి కుటుంబాలు కొన్ని తమ నివాసాన్ని అక్కడికి మార్చుకున్నాయి.
అయితే చాలాకాలంపాటు రాగి పని ఒక కుటుంబ వ్యవహారంలాగా ఉండేది. “ప్రతి ఒక్కరూ పరిహాసాలాడుకుంటూ, మాట్లాడుకుంటూ పని చేసేవాళ్ళు. పనిలో పోటీపడుతుండేవాళ్ళు కూడా. అలా పోటీపడే తత్వంవల్లనే మెరుగ్గా పనిచేసేవాళ్ళు,” చెప్పారు తమ వృత్తికళలో నిపుణుడైన ప్రదీప్ టమ్టా.
మహిళలు ఈ ప్రక్రియలో అంతర్భాగంగా ఉంటారు. కొలిమిని రాజేయటం కోసం దగ్గర్లోని అడవుల నుంచి కట్టెలు ఏరుకు రావడం, తయారైన సామాన్లకు మెరుగు పెట్టడం, కొలిమి పంకాను తిప్పడం, అతుకులు పెట్టడానికి వాడే పొడిని సిద్ధం చేయడం వీరి వంతు. చాలామంది మహిళలు కుటుంబ బాగోగులు చూసుకోవటం, వంట చేయటాల మధ్య పాత్రల డిజైన్లను రూపొందించడం, సుత్తె కొట్టడానికి ముందు రాగిరేకుని వేడెక్కించడం వంటి సున్నితమైన పనులను కూడా చేపడతారు.































