ఉత్తర కేరళలోని కోళిక్కోడ్‌లో ఆగకుండా కురుస్తోన్న వర్షాలు, రాత్రుళ్ళలో జిల్లా కలెక్టర్ కార్యాలయం బయట పడుకునే ఆ వృద్ధుడిని చికాకు పెట్టినట్టు కనిపించడంలేదు. గుడ్డతో కట్టుకున్న గుడారం ఆయనకు కల్పిస్తున్న రక్షణ అంతంతమాత్రమే. పగలంతా ఆయన, నిరసన ప్రదర్శిస్తోన్న ఆదివాసుల కుటుంబాలతో భుజం కలిపి కూర్చుని కనిపిస్తారు: రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే తమకు కేటాయిస్తామని వాగ్దానం చేసిన భూమి కోసం, నిలంబూర్కి చెందిన ఆ 60 ఆదివాసీ కుటుంబాలు సుమారు 70 రోజుల నుంచి సమీపంలోని మళప్పురంలో నిరవధిక సమ్మె చేస్తున్నాయి.
దాదాపు అన్ని రోజులూ అక్కడ కనిపిస్తుండే ఆ పోరాట కన్వీనర్, 96 ఏళ్ళ అయినూర్ వాసు ఆ పోరాటానికి కేంద్రబిందువే కాదు, దానికి నైతికపరంగా పెద్దదిక్కు కూడా. వాళ్ళంతా ఆయనను ‘గ్రో’ వాసు అనే పేరుతో ప్రేమగా పిలుచుకుంటారు. బక్కపలుచని ఆకారం, మెత్తని స్వరం ఉన్న ఆయనలోని నిశ్చయం ఏ మాత్రం సడలనిది. చాలామంది నిశ్శబ్దంలోకీ విశ్రాంతిలోకీ జారుకునే ఆ వయసులో, వాసు మాత్రం నిర్వాసితులకు దన్నుగా నిలవబడటాన్ని కొనసాగిస్తూనే వున్నారు. “సాంకేతికతల పేరుతో ప్రభుత్వం ఈ ఆదివాసీ కుటుంబాలను మోసం చేస్తోంది,” అన్నారాయన. ముడతలు పడిన ముఖంలో ఆయన కళ్ళు ప్రజ్వలిస్తున్నాయి. “భూమి, వాళ్ళ హక్కు. దానం కాదు.”
నిలంబూర్కి చెందిన ఈ కుటుంబాలు 2023–24లో, ఐటిడిపి (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్) కార్యాలయం ముందు 314 రోజులపాటు చేసిన నిరాహారదీక్ష తర్వాత ఈ పోరాటం కొనసాగింది.
ఆ 60 కుటుంబాలకు 50 సెంట్ల చొప్పున భూమిని ఆరునెలల లోపు ఇస్తామని జిల్లా కలెక్టర్ రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాత, ఆ పోరాటం ఆగింది. కానీ 15 నెలల తర్వాత కూడా, కుంటి సాకులు చెప్పటం తప్ప ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో, మరోసారి తమ పోరాటాన్ని మొదలుపెట్టేందుకు ఆ కుటుంబాలు వీధుల్లోకొచ్చాయి. ఒకప్పుడు ప్రమాదకరమైన నక్సలైట్‌గా ముద్రపడిన గ్రో వాసు ఎన్నో రాత్రులు ఆ సత్యాగ్రహ మండపంలోని కటికనేల పైనే గడుపుతున్నారు.
ఆయన రాజ్యంతో తలపడడం ఇటీవలి సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కాదు. 2023లో, కోళిక్కోడ్ జిల్లాలో జరిగిన పోలీసు చర్యకు వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆయన రెండు నెలలపాటు జైల్లో గడిపారు. ఆ కేసు 2016 నాటిది. నిలంబూర్ అడవుల్లో మావోయిస్టులైన కొప్పమ్ దేవరాజన్, అజితల బూటకపు ఎన్కౌంటర్ హత్యలపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతూ ఆయన కోళిక్కోడ్ వైద్య కళాశాల మార్చురీ వెలుపల నిలబడి పోరాటం చేశారు.
అరెస్ట్ అయిన తర్వాత బెయిల్‌కు దరఖాస్తు చేసేందుకు ఆయన నిరాకరించారు. గతంలోలానే, జైలు ఆయనను వంచలేకపోయింది. నిర్దోషిగా విడుదల కావటం, రాజ్య హింసపై ఆయన చేసే విమర్శకు మరింత పదునుపెట్టింది.








