ఈ కథనం పులిట్జర్ సెంటర్ మద్దతుతో పార్థ్ ఎమ్.ఎన్. అందిస్తోన్న సిరీస్‌లో ఒక భాగం
అప్పుల్లో మునిగిపోయి ఉన్నప్పటికీ, కేరూ దహిఫళేను 2025 మే మొదటివారంలో మొహటే గ్రామం మొత్తానికీ విందు ఇవ్వటాన్ని ఆపలేకపోయింది. రేకుల పైకప్పు ఉండే ఆయన గుడిసె ముందున్న ఒక ఎకరం పొలంలో సుమారు 3,000 మంది జనం వచ్చి బ్రహ్మాండమైన శాకాహార విందును ఆరగించారు.
ఖర్చు: రూ. 1.5 లక్ష.
అంత డబ్బు 70 ఏళ్ళ వయసున్న దహిఫళే వద్ద లేదు. దాంతో ఆయన ఆ డబ్బును ఒక ప్రైవేట్ వడ్డీ వ్యాపారి నుంచి నెలకు మూడు శాతం వడ్డీ, అంటే ఏడాదికి 36 శాతం వడ్డీకి, అప్పు తీసుకున్నారు. నిరాశపరిచిన శీతాకాలపు పంట కాలం తర్వాత అది అతని మెడ చుట్టూ ఒక పెద్ద గుదిబండను బిగించవచ్చు. ఆయన ఉల్లిపాయలను సాగు చేశారు, కానీ కరవు కారణంగా పంట ఎండిపోయి ఆయన పెట్టిన రూ. 35,000 పెట్టుబడిని మింగేసింది.
ఇల్లు గడవటానికి కష్టపడుతున్నప్పటికీ, ఆ విందును ఏర్పాటు చేయటానికి మాత్రం ఆయన మరో ఆలోచన చేయలేదు. "లేకుంటే, దేవత నన్ను ఆశీర్వదించదు, నా కోరికలు తీర్చదు," అన్నారతను.
మొహటే గ్రామం అహిల్యానగర్ (ఇంతకుముందు అహ్మద్‌నగర్) జిల్లా, పాథర్డీ తాలూకాలో ఉంటుంది. దహిఫళే ఇల్లు ప్రసిద్ధ మొహటా దేవి ఆలయం దిగువకు మలుపు తిరిగిన దారివెంట ఉంటుంది. ఈ గుడి దాదాపు రూ. 20 కోట్లు ఖర్చుపెట్టి 2009 నుంచి20013 వరకూ పునర్నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం. ఇది మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆలయాలలో ఒకటి. ఏడాదికి 25 లక్షల మంది వరకూ భక్తులు ఈ గుడికి వస్తారు.













