దనామతి తనకొచ్చే పింఛనులోని దాదాపు సగం డబ్బును బెల్లం, పుగాకు వంటి పదార్థాలున్న టూత్‌పేస్ట్ కోసం ఖర్చుపెడతారు.
"నాకు పింఛనుగా వచ్చే వెయ్యి రూపాయలలో 500 రూపాయలను నాకు తిండిని సమకూర్చే నా తమ్ముడి కోడలికి ఇస్తాను," అని ఆమె పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని ఉప్పు, మిరపకాయలు, సబ్బు, మర్దన నూనె, గుడాకు కొనడానికి ఖర్చు చేస్తాను."
ఆమెకు మిగిలింది కేవలం ఒకటి రెండు పళ్ళు మాత్రమే కదా, ఒక్క టూత్‌పేస్ట్ కోసం అంత ఖర్చు చేయడం మరీ ఎక్కువ కదా అని ఈ విలేఖరి ఆమెను సరదాగా ఆటపట్టించినప్పుడు, ఆమె చిన్నగా నవ్వి ఇలా ఒప్పుకున్నారు: "అది లేకపోతే నాకు ఏమాత్రం మంచిగా అనిపించదు. మీ అందరికీ ఉండే గుట్కా (నమిలే పొగాకు) వ్యసనం లాగే అది కూడా ఒక వ్యసనం."
దనామతి మట్టి పలకలు పైకప్పుగా ఉండే ఒక మట్టి ఇంట్లో నివసిస్తారు. పెద్దగా సామాన్లేమీ లేని ఆ ఒంటిగది ఇంట్లోకి వెళ్ళాలంటే వంగి వెళ్ళాలి. రాగులను దంచటానికి ఒక రాతి రోకలి బండ, ఒక టార్చి, ఒక మట్టి చుల్హా (పొయ్యి), బట్టలున్న ఒక వెదురు బుట్ట - అవే అక్కడున్న ప్రధాన వస్తువులు. ఆ పెద్ద వయసు మహిళ నేల మీదే నిద్రపోతారు.
మేం మాటలు మొదలుపెట్టగానే, ఆమె ఆ రాతి రోకలిబండను బయటకు తీసి, దేశంలోనే అత్యంత పేద ప్రాంతాలలో ఒకటైన ఒడిశాలోని కాలాహాండీలో పెరిగిన తన బాల్యం గురించి మాట్లాడుతూ, దంచటం మొదలుపెట్టారు.












