అది 2026 మే నెలలోని ఒక ఆదివారం. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఉన్న మతువా సముదాయపు ఆధ్యాత్మిక కేంద్రమైన ఠాకూర్బారి ప్రాంగణంలో భారీ జనసందోహం వచ్చి చేరింది. అయితే, వారిలో చాలామంది అక్కడి ఆలయంలో ప్రార్థనలు చేయడానికైతే రాలేదు. మండుతున్న వేసవి ఎండను సైతం లెక్కచేయకుండా, తమ పౌరసత్వానికి రుజువుగా ఉపయోగపడే పత్రాలను పొందే ఆశతో వారు పొడవైన వరుసలలో నిలబడి ఉన్నారు.
వారంతా వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పేర్లు తొలగించబడినవారు. రాష్ట్రంలో ఈ విధంగా పేర్లు తొలగించిన 90 లక్షల మంది వోటర్లలో వీరు కూడా ఉన్నారు. ఏప్రిల్ 2026లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో వారు తమ వోటు హక్కును వినియోగించుకోలేకపోయారు.
మతువా ప్రాబల్యం ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వోటర్ల జాబితాల నుండి పేర్లు తొలగించబడిన వారి జాబితాలో హిందువుల పేర్లు అధికంగా ఉన్నాయి.
ఠాకూర్బారి వద్ద గుమిగూడి ఉన్న జనసందోహంలో హిందూ కార్డును తీసుకోవడానికి తన భర్త కార్తిక్‌తో కలిసి అక్కడికి వచ్చిన లలిత ధాలి కూడా ఉన్నారు. కాబిలాస్పూర్కు చెందిన 43 ఏళ్ళ లలిత, అక్కడికి చేరుకోవడానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరం స్కూటర్‌పై ప్రయాణించారు. కార్తిక్ పేరు తుది SIR జాబితాలో ఉన్నప్పటికీ, ఆమె పేరు మాత్రం అందులో లేదు.
లలిత తాత, తండ్రి 1950లలో భారతదేశానికి వచ్చారు, కానీ 1984లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్ళిపోయారు. కొన్నేళ్ళలోనే వారు మళ్ళీ భారతదేశానికి తిరిగివచ్చారు. "ఒర్ బాబా ఎపార్ ఒపార్ కొర్తొ. కే జానే కోన్ పారే జన్మేచ్చే [ఆమె తండ్రి సరిహద్దుకు అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. ఆమె ఏ వైపున పుట్టిందో ఎవరికి తెలుసు]?" అని 53 ఏళ్ళ కార్తీక్ అంటారు.
మతువాలు 19వ శతాబ్దం చివరలో ఆవిర్భవించిన ఒక బ్రాహ్మణ వ్యతిరేక వర్గానికి చెందినవారు. అవిభక్త బెంగాల్ తూర్పు ప్రాంతంలో అణగారిన కులాలవారిని—ముఖ్యంగా నమఃశూద్రులను—ఒకటిగా చేర్చడానికి హరిచంద్ ఠాకూర్ చేసిన కృషి నుండే వీరి మూలాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో నమఃశూద్రులు (నామశూద్రులు) షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్నారు. దుస్థితిలో ఉన్న అనేకమంది మతువాలు పశ్చిమ బెంగాల్‌కు వలసపోయారు, కానీ వారి వద్ద ఎటువంటి పత్రాలు లేవు. "విభజన తర్వాత, తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో నామశూద్రులు కూడా మతపరమైన వేధింపులకు గురయ్యారు," అని అయాన్ గుహ పేర్కొన్నారు. ఇంగ్లండ్‌లోని సస్సెక్స్ విశ్వవిద్యాలయంలో ఫెలోగా ఉన్న అయాన్, పశ్చిమ బెంగాల్‌లోని కుల వ్యవస్థకు సంబంధించిన రాజకీయ కోణాలపై సుదీర్ఘకాలంగా పరిశోధన చేస్తున్నారు.












