దుర్గ, నారాయణస్వామి ప్రదర్శించిన ‘గంగమ్మ నీర్నాగా జడే హెణితవళె’’ నాటకం ముగిసేసరికి సాయంత్రం అయ్యింది. కోటిగానహళ్ళి రామయ్య రచించిన ఈ కన్నడ నాటకం, భూమిపై, నీటిపై ప్రజలకు ఉండే రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడుతుంది. అంటరానితనంపై ప్రజల దృష్టిని ఆకర్షించే ఒక పిలుపుగా, రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని తరచూ ప్రదర్శిస్తుంటారు.
తమ పాటలోని చివరి సంగీత స్వరాలు మరుగునపడుతున్నప్పుడు, వీధినే తమ వేదికగా మలచుకున్న చోట, వారు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పండితుడు. సంఘ సంస్కర్త. దళితుల హక్కుల కోసం, సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి.
అప్పటివరకూ, జనాలందరూ శ్రద్ధగా కూర్చొని నాటకం చూశారు. కానీ వారు అంబేద్కర్ చిత్రపటాన్ని బయటికి తీయగానే, కర్ణాటకలోని ఆ చిన్న గ్రామంలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
“మేం చిత్రపటాన్ని ప్రదర్శించినప్పుడు, ప్రజలు మా కులాన్ని ఊహిస్తారు. మాకు నీళ్ళు ఇవ్వడానికి నిరాకరిస్తారు. వారి వరండాలో కూర్చోవద్దని కూడా చెబుతారు. కొన్ని గ్రామాల్లో అయితే నిర్వాహకులు మా ప్రదర్శనను సైతం రద్దు చేస్తారు,” అంటూ నారాయణస్వామి నిట్టూర్చారు.
ఇక 31 ఏళ్ళ దుర్గ దగ్గరికి వస్తే, ఆమెను తన వయసు, వైవాహిక స్థితి, ఇంకా మరెన్నో విషయాల గురించి ప్రశ్నిస్తారు: “నీ తల్లిదండ్రులూ, కుటుంబ సభ్యులూ నువ్వు ఇలా ప్రదర్శన ఇచ్చేందుకు అనుమతిస్తారా?”



























