జనాబాయి సోనావణే తన సన్నిహిత స్నేహితులతో ఎప్పుడూ వాదించడం, గొడవ పెట్టుకోవడం చేయలేదు.
కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉంది. "నేను త్వరగా చిరాకుపడిపోయి, చిన్న చిన్న తేడాలొచ్చినా నా స్నేహితులతో గొడవ పడుతున్నాను," మహారాష్ట్రలోని భాదోళే గ్రామంలోని తన రెండు గదుల చిన్న ఇంటి బయట కూర్చొనివున్న జనాబాయి (62) చెప్పారు.
ఈ 2025 వేసవిలో రాష్ట్రంలోని కొల్హాపూర్ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. తాను నిద్ర పోలేకపోవటాన్ని జనాబాయి గ్రహించారు. ఈ అసౌకర్యం ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుందని మొదట్లో ఆమె భావించారు. అయితే, ఆమె కనీసం మూడు గంటల పాటు కలత నిద్ర కూడా పోలేని రోజులున్నాయి. ఆ రోజులు వారాలుగా మారి నెలలుగా సాగాయి. నిరంతరం చిరాకు, అలసటలు ఆమెను బాధించాయి.
సొంత భూమిలేని రైతు అయిన జానాబాయి రోజుకు ఎనిమిది గంటల పాటు ఇతరుల పొలాల్లో వెన్ను విరిగేలా శ్రమపడి పనిచేస్తారు. ఆమె కలుపు తీయటం, భారీగా ఉండే గడ్డి మోపులను ఎత్తడం, పంట కోతలు కోయటం వంటి పనులు చేస్తారు. సాయంత్రమయ్యేసరికి ఆమె అలసిపోతారు - భుజాలు నొప్పెడతాయి, ఆ రోజు పనిభారానికి కాళ్ళు బరువెక్కిపోతాయి. అలాంటి రోజున, ఆమె సాధారణంగా రాత్రి 10 గంటలకు తన ఇంటి గుమ్మం దగ్గర కుదురుకొని నిమిషాల్లో నిద్రపోయేవారు.
కానీ ఆ గాఢమైన, ప్రశాంతమైన నిద్ర నిండిన రాత్రులు ఇప్పుడు ఒక సుదూర స్వప్నంలా మిగిలిపోయాయి. ఇటీవలి నెలల్లో ఈ ప్రాంతంలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు, ఆర్ద్రత ఆమెకు రాత్రంతా చెమటలు పట్టేలా చేస్తున్నాయి. అటూ ఇటూ దొర్లుతూ, నిమ్మళం లేకుండా, ఇంటి రేకుల పైకప్పు వెలువరించే వేడి వల్ల ఆమె తరచుగా మేల్కొంటూ ఉంటారు.
ఒక్కసారి మేల్కొంటే, మళ్ళీ నిద్రపోవటానికి ఆమెకు కనీసం ఒక గంట సమయమైనా పడుతుంది.












