నాకప్పుడు తొమ్మిది పదేళ్ళుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలోని కొలకలూరు మా ఊరు. మా ఊర్లో దూదేకుల ముస్లిములైన ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఆయా కాలాల్లో దొరికే తాజా పూలను మాలలుగా కట్టి ఊరంతా వీధుల్లో తిరుగుతూ అమ్మేవారు. నడివయసులో ఉన్న వారిలో ఒకరు బక్కగా, బలహీనంగా ఉండేవారు; మరొకరు ఎత్తుగా, దృఢంగా ఉండేవారు. నాకిప్పుడు వాళ్ళ పేర్లు గుర్తులేవు, అసలు తెలియదు కూడానేమో! నేను వాళ్ళను పిన్నీ అని పిలిచేదాన్ని. వాళ్ళు మా అమ్మను అక్కా అనేవాళ్ళు. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండగా కొద్దిరోజులు బడికి వెళ్ళారట. అప్పుడు మా తాతయ్య వాళ్ళకు చదువు చెప్పాడట. బహుశా అందుకనేమో మా కుటుంబమంటే చాలా ప్రేమగా, గౌరవంగా ఉండేవాళ్ళు.
ఆ రోజుల్లో మల్లెపూలు కేవలం వేసవి కాలంలోనే దొరికేవి. మిగిలిన కాలాల్లో వాళ్ళు మధ్యలో ఒకే ఒక్క గులాబీ పెట్టి చెండులుగా కట్టిన చేమంతి పూలను, మరువం, దవనం కలిపి మాలలుగా కట్టిన బంతి, చేమంతి, కారబ్బంతి, చిట్టి చేమంతి, కాగడా మల్లెలు, కనకాంబరాలను అమ్మేవారు. వెలిసిపోయిన నూలు చీరలు కట్టుకొని, మోచేతులకు తగిలించుకున్న వెదురుబుట్ట నుంచి రంగు రంగుల తాజా పూల మాలలు వేలాడుతుండగా, వాళ్ళు ఆ పూల మాలలను - మల్లేపూలూ, చేమంతీ పూలూ, కాగడాలూ, కారబ్బంతులూ, కనకాంబరాలే... అని పిలుస్తూ వీధుల్లో తిరుగుతూ అమ్మేవారు.
అప్పట్లో వేసవి కాలం సెలవులంటే అమ్మాయిలకు, వారి అమ్మలకు మల్లె పూల జడలూ, పూల ముడులే! జడమొగ్గలుగా ప్రసిద్ధి చెంది, ఏవో కొన్ని ఇళ్ళల్లో తప్ప బయట కొనటానికి దొరకని దొంతర మల్లెలను మా పిన్నివాళ్ళు నాకోసం ప్రత్యేకంగా, ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టి, అరిటాకులోనో తామరాకులోనో భద్రంగా పొట్లం చుట్టి తెచ్చిచ్చేవాళ్ళు.
ఇప్పుడు మల్లెపూలు వేసవితో పనిలేకుండా ఏడాది పొడవునా దొరుకుతున్నాయి. కానీ పెళ్ళిళ్ళ సందర్భంగా తప్ప, ఆమ్మాయిలెవరూ పూల జడలను వేసుకోవటంలేదు. అలాగే తాజా పూలను విడిపూలగానూ, మాలలుగానూ చెండులుగానూ అల్లి వీధుల్లో తిరుగుతూ అమ్మే మహిళలు కూడా ఎవరూ కనిపించటంలేదు.
మనకిప్పుడు యాప్లు, నోటిఫికేషన్లు, డోర్స్టెప్ డెలివరీలు ఉన్నాయి తప్ప, మనల్ని మన ముద్దుపేర్లతో పిలుస్తూ, వీధుల్లో మన మాతృభాషను సజీవంగా ఉంచిన స్వరాలు లేవు - బౌవా లేదు, చిన్నా లేదు. సౌకర్యాలు పెరిగాయి, కానీ మన సామూహిక జ్ఞాపకాలు మాత్రం మసకబారుతున్నాయి.