రుఖాబాయి పాడవీ ఆ వస్త్రాన్ని వేళ్ళతో తడమకుండా ఉండలేకపోతున్నారు. మేం మాట్లాడుకుంటోన్న సమయంలో, అలా చేయటం ఆమెను మరో సమయానికి, మరో జీవితంలోకి తీసుకువెళ్తోందని నేను గ్రహించాను.
"ఇదే నా పెళ్ళి చీర," అక్రాణీ తాలూకాలోని కొండలతో నిండిన ఆదివాసీ ప్రాంతంలో మాట్లాడే భిల్ ఆదివాసీ భాషలో చెప్పారామె. ఒక చార్పాయ్ (మంచం) మీద కూర్చొని ఉన్న ఆ 90 ఏళ్ళ మహిళ తన ఒడిలో పెట్టుకున్న బంగారు రంగు అంచున్న లేత గులాబీ రంగు నూలు చీరను మృదువుగా తడుముతున్నారు.
"నా తల్లిదండ్రులు తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో దీన్ని కొన్నారు. ఈ చీర నాకు వాళ్ళ జ్ఞాపకం," చిన్నపిల్లలా సంబరంగా నవ్వుతూ చెప్పారామె.
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా, అక్రాణీ తాలూకాలోని మోజరా గ్రామంలో రుఖాబాయి పుట్టారు; ఆమె జీవితమంతా ఈ ప్రాంతంలోనే గడిచింది.
"నా తల్లిదండ్రులు నా పెళ్ళి కోసం 600 రూపాయలు ఖర్చుచేశారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ డబ్బు కింద లెక్క. వాళ్ళు ఐదు రూపాయలు ఖర్చుచేసి ఈ పెళ్ళి చీరతో సహా బట్టలు కొన్నారు," చెప్పారామె. అయితే నగలను మాత్రం ఆమె ప్రియమైన తల్లి ఇంటివద్దనే తయారుచేశారు.
"అప్పుడు కంసాలి గానీ, నగలు చేసేవారుగానీ లేరు. మా అమ్మ వెండి నాణేలతో ఒక నెక్లెస్ తయారుచేసింది. నిజమైన వెండి రూపాయలు. ఆమె వాటికి రంధ్రం చేసి, వాటిని మందమైన గోధడీ (చేతి తయారీ దుప్పట్లు) దారానికి గుచ్చింది," ఆ ప్రయత్నాన్ని తలచుకొని ముసిముసిగా నవ్వుతూ చెప్పారు రుఖాబాయి. ఆమె తన మాటల్ని మరోసారి చెప్పారు: "వెండి నాణేలు హా. ఇప్పటిలా కాగితాల డబ్బు కాదు."








